బాబు ఆక్రమ అరెస్టుపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-09-20T00:33:32+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా మారేగావ్‌లో ఆంధ్రా ప్రాంత రైతులు గర్జించారు.

బాబు ఆక్రమ అరెస్టుపై ఆగ్రహం
మహారాష్ట్రలో నిరసన ర్యాలీ చేస్తున్న ఏపీ రైతులు

మహారాష్ట్రలో గర్జించిన ఆంధ్రా రైతులు

మారేగావ్‌లో భారీఎత్తున నిరసన ర్యాలీ

పీసీపల్లి, సెప్టెంబరు 19 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా మారేగావ్‌లో ఆంధ్రా ప్రాంత రైతులు గర్జించారు. కనిగిరి నియోజకవర్గానికి చెందిన వందలాదిమంది రైతులు అక్కడి తెలుగువారితో కలిసి సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి, పామూరు, సీఎస్‌పురం, కనిగిరి, వివిధ మండలాల నుంచి ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. యావత్‌మాల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు రైతులందరూ సోమవారం సమావేశమై బాబుపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపేందుకు అక్కడ అనుమతి తీసుకున్నారు. ఈ ర్యాలీకి ముందు సమావేశమైన రైతులనుద్దేశించి పలువురు మాట్లాడుతూ తెలుగు యువతకు ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు నిరంతరం శ్రమించారన్నారు. ఆయన చేసిన సేవలను వైసీపీ ప్రభుత్వం వినియోగించుకోకుండా కుట్రలు, కుతంత్రాలతో తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని వారు ఆరోపించారు. అనంతరం ‘సైకో పోవాలి-సైకిల్‌ రావాలి, చంద్రబాబునాయుడిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలి, చంద్రన్న జిందాబాద్‌.. ఉగ్రన్న జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. మారేగావ్‌ ప్రధాన కూడలి నుంచి బాబుతో మేము అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన ర్యాలీలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీరికి మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ కూలీలు మద్దతు తెలిపారు. నిరసన ర్యాలీలో నెలకుర్తి కొండయ్య, నెలకుర్తి మోహన్‌రావు, శ్రీను, కొండయ్య, కూరపాటి మల్లికార్జున, నల్లూరి మోహన్‌రావు, చెన్నుపాటి శ్రీనివాసులు, రమణయ్య, అంకమ్మ, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, సుజాత, అనూష, జయలక్ష్మి, రాజేశ్వరి, మల్లేశ్వరి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి ఉన్నారు.

Updated Date - 2023-09-20T00:33:32+05:30 IST