Share News

అంగన్వాడీల ఆట-పాట

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:39 AM

డిమాండ్ల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు 6వ రోజు ఆదివారం రెవిన్యూ కార్యాలయం ఆవరణలోని సచివాలయం ఎదుట ధర్నా చేశారు.

అంగన్వాడీల ఆట-పాట

గిద్దలూరు, డిసెంబరు 17 : డిమాండ్ల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు 6వ రోజు ఆదివారం రెవిన్యూ కార్యాలయం ఆవరణలోని సచివాలయం ఎదుట ధర్నా చేశారు. ఒంగోలు- నంద్యాల హైవే రోడ్డుపై కోలాటం ఆడి పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు స్వర్ణకుమారి మాట్లాడుతూ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరుపక పోవడం శోచనీయమని ధ్వజమె త్తారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పలువురు లబ్ధిదారులు దీక్ష శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆవులయ్య, నరసింహులు, అంగన్‌వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మున్నా, వరలక్ష్మి, రహమత్‌భీ, రమణమ్మ, విజయలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు, జీతాలు పెంచుతామని అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను మరిచారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. స్థానిక ఎన్జీవో హోం ఆవరణలో ఆదివారం ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వెళ్లి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తించి వారి గౌరవ వేతనం రూ.3700 నుంచి నెలకు రూ.10,500కు జీతం పెంచారన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 6 రోజులుగా చేస్తున్న ధర్నాలను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 20న యువగళం ముగింపు సభలో అంగన్వాడీల సమస్యను యువగళం సభ దృష్టికి తీసుకుపోతానన్నారు. సమ్మెను విరమింపజేయడానికి బలవంతంగా కేంద్రాల తళాలు పగులగొట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, కాకర్ల కోటయ్య, తోట మహేష్‌, ఎం.మంత్రునాయక్‌, చెవుల అంజయ్య, కొత్త భాస్కర్‌, పోక వెంకటసుబ్బయ్య, కందుల నారాయణరెడ్డి, చిమట వెంకటరాములు, చేదూరి కిశోర్‌, షేక్‌ రఫీ, బోడా చెన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీలకు కిశోర బాలికల మద్దతు

పొదిలి : అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆరు రోజులుగా చేస్తున్న సమ్మెకు ఆదివారం కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చెప్పిన హమీలను నెరవేర్చాలని వారి పనికి తగిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టిన ముఖ్యమంత్రి మొండిగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. ఆయన తన వైఖరి మార్చుకొని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Updated Date - Dec 18 , 2023 | 01:39 AM