అకా‘డమ్మీ’లు

ABN , First Publish Date - 2023-01-18T00:35:59+05:30 IST

కళలు సమాజ మార్పునకు దారులు. వీటికి ఎక్కడ ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వపరంగా చేయూత అందినప్పుడే కళాకారులు నూతన ప్రక్రియలతో ముందుకొచ్చి సమాజ వికాసానికి ఉపయోగపడే కళారూపాలను ఆవిష్కరించే అవకాశం ఉంది.

అకా‘డమ్మీ’లు

మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిల్‌

నిధులు, విధులు కేటాయించని ప్రభుత్వం

నాడు టీడీపీ హయాంలో కళారంగం కళకళ

ప్రస్తుతం నామ్‌కే వాస్తేగా అకాడమీల డైరెక్టర్లు

ఆందోళన వ్యక్తం చేస్తున్న కళాకారులు

కళలు సమాజ మార్పునకు దారులు. వీటికి ఎక్కడ ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వపరంగా చేయూత అందినప్పుడే కళాకారులు నూతన ప్రక్రియలతో ముందుకొచ్చి సమాజ వికాసానికి ఉపయోగపడే కళారూపాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కళలకు చేయూత కరువై కునారిల్లుతున్నాయి. ఇక జిల్లాలో పరిస్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. కళలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. కళలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన అకాడమీలు నిధులు లేక నీరుగారిపోతున్నాయి.

ఒంగోలు (కల్చరల్‌), జనవరి 17 : ప్రభుత్వ ఉదాసీనతతో కళారంగం కుదేలైంది. కళలకు ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన వివిధ అకాడమీలు డమ్మీలు మారిపోయాయి. నవ్యాం ధ్ర ఏర్పాటు అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వివిధ అకాడమీ లను ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటా యించింది. దీంతో ఆయా రంగాల్లో కార్యక్రమా లు రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. నాటక అకాడమీకి మన జిల్లా నుంచి ఇద్దరిని డైరక్టర్లుగా నియమించారు. వారి సారథ్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు జరగటమే కాకుండా జిల్లాకేంద్రమైన ఒంగోలులో వారంరోజులు నాటక వారోత్సవాలు నిర్వహించారు. లక్షలాది రూపాయల నిధులను నాటక ప్రదర్శనల కోసం వారు జిల్లాకు తెచ్చారు. అదేవిధంగా డాక్టర్‌ నాగభైరవ ఆదినారా యణ సాహిత్య అకాడమీ డైరక్టర్‌గా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో కార్యక్రమాలు జరిగాయి. ఇక సంగీత అకాడమీ సైతం జిల్లాలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు చేయూతనందించగా, నృత్య అకాడమీ ఆధ్వర్యంలో వివిధ ప్రదర్శనలు జరిగాయి. ఈ విధంగా ఆయా కళలు విస్తృతంగా ప్రదర్శించబడటమే కాకుండా కళాకారులకు ఉపాధి లభించింది.

నిధుల ఊసే లేదు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళారంగం కళ తప్పింది. మూడున్న రేళ్లుగా అకాడమీలకు నిధుల కేటాయింపు ఊసేలేదు. జిల్లాకు ఒక్క రూపాయి వచ్చింది కానీ, అకాడమీల సహకారంతో ఒక్క కార్యక్రమం ఏర్పాటైన దాఖలాలు లేవు. ఒంగోలు నుంచి సాహిత్య అకాడమీకి డైరెక్టర్‌ను, ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి సంగీత అకాడమీకి డైరెక్టర్‌ను నియమించినా వారు బొత్తిగా ఆ రంగాలతో ఏమాత్రం సంబంధం లేని వారు. దీంతో వారు ఇప్పటివరకు ఆయా రంగాల కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, జిల్లాలో ఆ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నది కానీ లేదు.

కష్టాల సుడిగుండంలో కళాకారులు

ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత లభించక కళారంగం విలవిలలాడుతోంది. కార్య క్రమాలు కుంటుపడటంతో ఆయా రంగాల కళాకారులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటు న్నారు. ఆఖరికి జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్ర మాలు, ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినపుడు ఏర్పాటు చేసే ప్రదర్శనలకు సైతం యంత్రాం గం పొరుగు జిల్లాలు, తెలంగాణకు చెందిన కళాకారులను రప్పించటంతో స్థానికులకు ఆద రణ కరువైంది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారి వేరే పని చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వృద్ధ కళాకారులు పెన్షన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్న ప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

Updated Date - 2023-01-18T00:36:17+05:30 IST