చెట్టును ఢీకొన్న పాలవ్యాను
ABN , First Publish Date - 2023-06-02T23:25:08+05:30 IST
ఓ పాల వ్యాను అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండలంలోని ఓగూరు సమీపంలో జరిగింది.

మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం
మృతుడు ఒంగోలు వాసి
కందుకూరు, జూన్ 2: ఓ పాల వ్యాను అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండలంలోని ఓగూరు సమీపంలో జరిగింది. వివరాల మేరకు.. సంగం డెయిరీకి చెందిన పాల ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు చేరవేసే వ్యాను శుక్రవారం తెల్లవారుజామున ఒంగోలు నుంచి బయలుదేరి కందుకూరు, పొన్నలూరు ప్రాంతాలలో పాల ఉత్పత్తులు దించి తిరిగి ఉలవపాడుకి వెళ్తుండగా ఓగూరు సమీపంలోని ప్రభుత్వ ఉద్యాన కళాశాల ఎదురుగా చింతచెట్టును ఢీకొంది. దీంతో వెంటనే మంటలు చెలరేగి పాలవ్యాను దగ్ధమవగా క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టకు చెందిన డ్రైవర్ దద్దాల వెంకటసాయి(26) సజీవ దహనమయ్యాడు. ఆనవాళ్లు లేకుండా కాలిపోయి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఘటనా స్థలాన్ని రూరల్ ఎస్‌ఐ శివనాంచారయ్య సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.