తర్లుపాడులో సమస్యల తాండవం

ABN , First Publish Date - 2023-08-11T02:09:43+05:30 IST

మండలం కేంద్రమైన తర్లుపాడు సమస్యలకు నిలయంగా మారింది. కొన్ని కాలనీలలో కనీస వసతులైన తాగునీరు, రోడ్డు, డ్రైన్లు లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

తర్లుపాడులో సమస్యల తాండవం

మురుగు నీటి నిల్వతో దుర్గంధం

రోగాల బారిన ప్రజలు

తర్లుపాడు, ఆగస్టు 10 : మండలం కేంద్రమైన తర్లుపాడు సమస్యలకు నిలయంగా మారింది. కొన్ని కాలనీలలో కనీస వసతులైన తాగునీరు, రోడ్డు, డ్రైన్లు లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ముదిరాజ్‌ కాలనీ, రైల్వే గేట్‌ వద్ద ఉన్న బీసీ కాలనీ, రజక వీధి, కోట, నాయుడుపల్లి కాలనీలలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సైడ్‌ కాల్వలు కూడా లేకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. వీధుల వెంట పందులు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు. ఈ కాలనీని 3 సంవత్సరాల క్రితం ఆదర్శగ్రామంగా చేసేందుకు ప్రభుత్వం రూ. కోటి నిధులు మంజూరు చేసింది. సైడ్‌ కాల్వలు నిర్మించి ఆనక సీసీ రోడ్లు మరిచారు. వర్షం పడితే ఈ కాలనీలలో నడవలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు బురదకు పడిపోయి గాయాల పాలవుతున్నారు. కాలనీలో ఉన్న మంచినీటి ట్యాంకుకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కాలనీ వాసులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీకి జలజీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.56 లక్షలు నిధులు మంజూరైనప్పటికీ రాజకీయ కారణాలతో పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవటంతో ఆ పనులు నిలిచిపోయాయి. కాలనీలోని సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇటీవల పారిశుధ్య కార్మికులు కూడా జీతాలు చెల్లించనందుకు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో చెత్త కొండలా పేరుకుపోయింది. కోటవీధిలో మురుగు పేరుకుపోయి పందులకు ఆవాసాలుగా మారింది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రంథాలయం, పాఠశాల ఎదురుగా మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-08-11T02:09:43+05:30 IST