Share News

పునాదుల్లోనే నిలిచిన భవనం

ABN , First Publish Date - 2023-11-20T00:51:33+05:30 IST

నాడు-నేడు పేరుతో ప్రభుత్వంగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు-నేడులో అంతులేని అవినీతి చోటు చేసుకొంటోంది.

పునాదుల్లోనే నిలిచిన భవనం

రాచర్ల, నవంబరు 19 : నాడు-నేడు పేరుతో ప్రభుత్వంగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు-నేడులో అంతులేని అవినీతి చోటు చేసుకొంటోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు వాటాల మత్తుతో మౌనం వహిస్తున్నారు. ఓ వైపు నాసిరకం వనులు జరుగుతుంటే వాటికి సంబంధిం చిన పూర్తిస్థాయిలో రికార్డులు ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మండల కేంద్రమైన రాచర్లలో కస్తూరిభా పాఠశాలలో మొదటి దశలో రూ.47లక్షలు మంజూరు కాగా పాఠశాలలో అవసరమైన అభివృద్ధి పనులు చేశారు. గత సంవత్సరం నాడు-నేడు కింద ఇంటర్మీడియట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు అదనపు తరగతుల కోసం కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. గతేడాది ప్రారంభించిన పనులు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. దీంతో బేస్‌మెంట్‌ వరకే పనులు జరిగాయి. ఇటీవల కొత్తగా కస్తూరిభా ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన మాలకొండమ్మ నాడు-నేడు పనులపై దృష్టి సారించారు. దీంతో ఒక్కొక్కటిగా అవినీతి బయటపడుతోంది. అనధికారికంగా పూర్తిస్థాయిలో బేస్‌మెంట్‌ నిర్మించలేదు. పిల్లర్ల స్థాయిలోనే నిర్మాణాలు వదిలేశారు. దీంతో వాటికి రూ.30 లక్షలు ఖర్చు చేశామని గతంలో పని చేసిన చెప్పినట్లు తెలుస్తోంది. పాఠశాల గదుల నిర్మాణం కోసం మేస్త్రీకి అడ్వాన్స్‌గా 8లక్షలు ఇచ్చినట్లు వార్తలు రావడం, దాదాపు 400 సిమెంటు బస్తాలు పాఠశాలలో ఉంచగా, వాటిని వినియోగించక పోవడంతో ఇప్పటికీ 200 సిమెంటు బస్తాలు గడ్డ కట్టాయి. దీంతో అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో ఈ నాడు-నేడు పనుల లెక్కలపై గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్‌కు ప్రస్తుతం వచ్చిన ప్రిన్సిపాల్‌కు విభేదాలు వచ్చాయి. ప్రస్తుత ప్రిన్సిపాల్‌ మాలకొండమ్మ జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాడు-నేడులో జరిగిన పనులకు సంబంధించి గతంలో పనిచేసిన అధికారి ఇంతవరకు రికార్డులు అందజేయలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారించాలని, ఈ సందర్భంగా ఆమె కోరినట్లు తెలుస్తోంది. దీంతో డీఈవో దీనిపై స్పందించారు. మండలంలోని ఎంఈవోలు శివకోటేశ్వరరావు, గిరిధరశర్మలకు విచారించాల్సిందిగా ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఎంఈవో గిరిధరశర్మ మాట్లాడుతూ సిమెంటు బస్తాలు గడ్డకట్టిన మాట వాస్తవమేనన్నారు నాడు-నేడు పనులపై గతంలో పని చేసిన ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు. అయితే పూర్తిస్థాయిలో విచారిస్తే అవినీతిపై స్పష్టత వస్తుందన్నారు. నాడు-నేడుకు చెందిన ప్రత్యేక అధికారి కూడా పర్యవేక్షించాల్సి ఉండగా ఎక్కడా కూడా పర్యవేక్షించిన దాఖలాలు కనిపించడం లేదు.

Updated Date - 2023-11-20T00:51:35+05:30 IST