330 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2023-02-06T22:56:39+05:30 IST

అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్‌ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు.

330 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
బియ్యం ఆటోతో నిందితులు విజిలెన్స్‌ అధికారులు

నిఘా వేసి పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

అక్రమార్కులపై కఠిన చర్యలు

డీఎస్సీ అశోక్‌వర్ధన్‌

కొండపి, ఫిబ్రవరి 6: అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను వెంటాడి ఆటోలోని బియ్యాన్ని, అలాగే రేషన్‌ షాపులో నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు. పెట్లూరు వైపు నుంచి కొండపి వైపు వస్తున్న రేషన్‌ బియ్యం ఆటోను విజిలెన్స్‌ అధికారులు వెంటాడారు. ఆ ఆటో కొండపిలోని రైస్‌ మిల్లులోకి వెళ్లింది. దీంతో ఆ ఆటోను, మిల్లులో ఉన్న దాదాపు 330 బస్తాల రేషన్‌ బి య్యాన్ని విజిలెన్స్‌ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్సై నాగేశ్వరావు, విజిలెన్స్‌ ఎమ్మార్వో పాల్‌, సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం విజిలెన్స్‌ అధికారులు సింగరాయకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీకి, కొండపి వీఆర్వో రామకృష్ణ సమక్షంలో స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యాన్ని అప్పగించారు. రైస్‌మిల్లును అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న పెరిదేపి గ్రామానికి చెందిన అశోక్‌ను, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆటో డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు పెట్లూరు గ్రామ పంచాయతీలోని చవటపాలెం గ్రామ రేషన్‌ షాపును విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. రేషన్‌ బియ్యం ఎక్కడి నుంచి తరలించారనే విషయంపై రేషన్‌ షాపులను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

అక్రమార్కులపై కఠిన చర్యలు

డీఎస్పీ అశోక్‌ వర్ధన్‌

విషయం తెలిసిన వెంటనే విజిలెన్స్‌ డీఎస్పీ టి. అశోక్‌వర్ధన్‌ కొండపి వచ్చి రైస్‌మిల్లును పరిశీలించారు. రేషన్‌ బియ్యాన్ని తరలించే వారిపై నిఘా పెట్టామని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వివిధ శాఖల్లో జరిగే అవినీతి, అక్రమార్కులపై నిఘా ఉంచి కఠిన చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

Updated Date - 2023-02-06T22:56:41+05:30 IST