పొగాకు కిలో రూ.215

ABN , First Publish Date - 2023-06-07T01:22:21+05:30 IST

దక్షిణాది పొగాకు మార్కెట్‌ జోష్‌ మీద ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే గరిష్ఠ ధర కిలోకు రూ.10 నుంచి 15వరకు పెరిగింది. మంగళవారం టంగుటూరు వేలంకేంద్రంలో కిలోకు అత్యధికంగా రూ.215 లభించగా పలు ఇతర కేంద్రాల్లో రూ.211 నుంచి రూ.214 వరకు పలికాయి.

పొగాకు కిలో రూ.215

పెరిగిన గరిష్ఠ ధరలు, పోటీపడుతున్న వ్యాపారులు

మీడియం, లోగ్రేడ్‌లకు కూడా కిలో రూ.205పైనే

జోష్‌గా సాగుతున్న పొగాకు మార్కెట్‌

ఒంగోలు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ జోష్‌ మీద ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే గరిష్ఠ ధర కిలోకు రూ.10 నుంచి 15వరకు పెరిగింది. మంగళవారం టంగుటూరు వేలంకేంద్రంలో కిలోకు అత్యధికంగా రూ.215 లభించగా పలు ఇతర కేంద్రాల్లో రూ.211 నుంచి రూ.214 వరకు పలికాయి. అలాగే మీడియం లోగ్రేడ్‌ల బేళ్లలో నాణ్యత ఉన్న వాటిని గతం కన్నా ధరలు పెంచి కిలో రూ.205 పైనే కొంటున్నారు. పలు ప్రధాన కంపెనీలు బేళ్ల కోసం వేలంలో పోటీ పడుతున్నాయి. ఈ సీజన్‌ వేలం ప్రారంభం నుంచి కొద్దిరోజులు మినహా మిగతా కాలం పొగాకు మార్కెట్‌ స్పీడుగానే ఉంది. గరిష్ఠ ధర కిలో రూ.200కు సీలింగ్‌ పెట్టి వ్యాపారులంతా ఒకటై పెరగకుండా నియంత్రిస్తూ వచ్చారు. సాధారణంగా మేలురకం కన్నా కిలో రూ.25 నుంచి రూ.35 వరకు తక్కువ ఇచ్చే మీడియం, అలాగే కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు తక్కువ ధరలు ఇచ్చే నాణ్యమైన లోగ్రేడ్‌లను కూడా రూ.190నుంచి 195 వరకు కొంటున్నారు. అయితే మేలురకం ధర మాత్రం పెంచకుండా వస్తున్నారు. గత వారంలో స్వల్పంగా పెంచి అక్కడక్కడా కిలోకు రూ.201 నుంచి రూ.205 ఇచ్చిన వ్యాపారులు సోమవారం రూ.209లకు, మంగళవారం కిలో రూ.215కు పెంచేశారు.

బేళ్ల కోసం వ్యాపారుల పోటీ

ఇప్పటివరకు ఉన్న సీలింగ్‌ను బ్రేక్‌ చేసి పలు ప్రధాన కంపెనీల బయ్యర్లు మేలురకం బేళ్ల కోసం పోటీపడుతున్నారు. కీలక కంపెనీ ఐటీసీ సైతం మంగళవారం కిలో గరిష్ఠ ధర రూ.209 వరకు ఇవ్వగా జీపీఐ, పీఎస్‌ఎస్‌, అలయెన్స్‌ తదితర పలు కంపెనీలు అంతకు మించి ధరలు ఇచ్చాయి. విదేశీ ఆర్డర్లకు సరిపడా కర్ణాటకలో పంట లభించకపోవడం, ఇప్పటివరకు ఆంధ్రా రైతులు మేలురకం కన్నా మీడియం, లోగ్రేడ్‌లను ఎక్కువగా తెస్తుండటంతో ఆర్డర్లకు సరిపడా పంపేందుకు వ్యాపారులు పోటీపడి మేలురకం బేళ్లను కొంటున్నట్లు సమాచారం. అలాగే మీడియం, లోగ్రేడ్‌లలో నాణ్యమైన వాటికి కూడా కిలో రూ.205పైనే ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకు దక్షిణాదిలో సుమారు 68.88 మిలియన్‌ కిలోలు అమ్మకాలు జరగ్గా సగటున కిలో రూ.196 లభించింది. ధరలు మరి కొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-06-07T01:22:21+05:30 IST