అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2023-01-18T00:28:35+05:30 IST

గిద్దలూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వై.రామకృష్ణయ్య తెలిపారు.

అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు

గిద్దలూరు, జనవరి 17 : గిద్దలూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వై.రామకృష్ణయ్య తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం మున్సిపాలిటీలోని 10 సచివాలయాల పరిధిలోని 20 వార్డుల్లో పూర్తయ్యింది. దీంతో ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇందులో రూ.1.60 కోట్లకు టెండర్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు. మిగతా రూ.40 లక్షల నిధులకు ప్రతి పాదనలు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. సిమెంటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధానత్య ఇచ్చినట్లు తెలిపారు.

రూ. 1.02 కోట్లకు ప్రతిపాదనలు

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచనల మేరకు రూ.1.02 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్‌ వై.రామకృష్ణయ్య తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.52 లక్షలు, జనరల్‌ ఫైనాన్స్‌ కింద రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.1.02 కోట్ల మేర పనులు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపామన్నారు. మార్చి నాటికి ఈ పనులు పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొత్తం అన్ని వార్డులలో పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గిద్దలూరు నిలిచిందన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి సచివాలయ పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే, కౌన్సిల్‌ ఆమోదంతో పనులను గుర్తించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-18T00:28:37+05:30 IST