సంగం డైరెక్టర్‌పై పోలీసుల జులుం

ABN, First Publish Date - 2023-11-20T05:08:46+05:30 IST

డైరెక్టర్‌ గొల్లపూడి శ్రీనివాసరావును ఆదివారం వేకువ జామున గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

ఘర్షణ ఘటనలో పేరు లేకున్నా ఇంటికి వెళ్లి బలవంతంగా తరలింపు

బైపాస్‌ సర్జరీ జరిగిందన్నా వినని వైనం

టీడీపీ నేతల ధర్నా పిలుపుతో వెనక్కి.. సొంత పూచీకత్తుపై విడుదల

చేబ్రోలు, నవంబరు 19: సంగం డెయిరీ డైరెక్టర్‌ గొల్లపూడి శ్రీనివాసరావును ఆదివారం వేకువ జామున గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వడ్లమూడి గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపఽథ్యంలో చేబ్రోలు పోలీసులు సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సహా 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ జాబితాలో గొల్లపూడి శ్రీనివాసరావు పేరు లేకపోయినా చేబ్రోలు పోలీసులు పెదనందిపాడు మండలం నాగులపాడులోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు భార్య, మాజీ ఎంపీటీసీ శైలజ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ జరిగినప్పుడు తన భర్త శ్రీనివాసరావు అక్కడ లేరని శైలజ పేర్కొన్నారు. తాము ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ఆరోపించారు. ఇటీవల తన భర్త శ్రీనివా్‌సకు బైపాస్‌ సర్జరీ జరిగిందని, తీసుకెళ్లద్దని మొరపెట్టుకున్నా పోలీసులు వినిపించుకోలేదన్నారు. శ్రీనివా్‌సను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారన్న సమాచారంతో చేబ్రోలు, పొన్నూరు, పెదనందిపాడు, గుంటూరుకు చెందిన టీడీపీ నాయకులు, సంగం పాలక వర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ఏకారణంతో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారని టీడీపీ తరఫు న్యాయవాదులు ప్రశ్నించటంతో పోలీసుల నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. ఘటన జరిగినప్పుడు శ్రీనివాసరావు అక్కడ లేరని నిరూపించుకోవాలని, ఘర్షణలో పాల్గొన్న వారిని అప్పగించి శ్రీనివాసరావును తీసుకువెళ్లాలని పోలీసులు చెప్పారు. అయితే, బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వ్యక్తిని సంబంధం లేని కేసులో అదుపులోకి తీసుకోవడం పట్ల టీడీపీ నేతలు ధర్నాకు దిగనున్నారన్న సమాచారంతో సొంత పూచీకత్తుపై శ్రీనివాసరావును విడిచిపెట్టారు. ఇదిలావుంటే, వడ్లమూడి గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను సైతం ఇదే కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated at - 2023-11-20T07:25:45+05:30