Yuvagalam: యువగళం 2000 కిలో మీటర్లు

ABN , First Publish Date - 2023-07-12T02:34:56+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 153వ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

Yuvagalam: యువగళం 2000 కిలో మీటర్లు

కీలక మైలురాయిని దాటిన లోకేశ్‌ పాదయాత్ర

కొత్తపల్లిలో ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డుకు శిలాఫలకం

కావలి/కొండాపురం/జలదంకి/ నెల్లూరు (ఆంధ్రజ్యోతి), జూలై 11: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 153వ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లు, రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన టీడీపీ అగ్రనాయకులు, భారీ జన సందోహం మధ్య లోకేశ్‌ పైలాన్‌తో పాటు కొత్తపల్లిలో ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ, సాగుతున్న తన పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకోవడం మరపురాని ఘట్టంగా పేర్కొన్నారు. కుప్పంలోని శ్రీవరదరాజస్వామి పాదాల వద్ద తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై, ప్రజలను చైతన్య పరుస్తూ లక్ష్యం దిశగా ముందుకు దూసుకుపోతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువగళం బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తనవెంట నడుస్తున్న బృందాల సేవలను జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు. యువగళం పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే దూకుడు కొనసాగించాలని కోరారు. ఈ సందర్బంగా యువగళం బృంద సభ్యులతో కలసి లోకేశ్‌ ఫొటోలు దిగారు. పేరుపేరునా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

రూ.5వేలు విరాళం ఇచ్చిన దివ్యాంగుడు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లెకు చెందిన దివ్యాంగుడు జీవన్‌ కుమార్‌రెడ్డి టీడీపీకి 5వేల రూపాయల విరాళాన్ని లోకేశ్‌కు అందజేశారు. తనకు వచ్చే పింఛన్‌ మొత్తంతో పాటు మరికొంత కలిపి ఈ విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. 1998లో చంద్రబాబు తన కాలికి శస్త్రచికిత్స చేయించారని, బాబును సీఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని లోకేశ్‌ అభినందించారు. టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు గోనుగొంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను లోకేశ్‌ అందజేశారు. యువగళం 2వేల కిలోమీటర్ల మజిలీ చేరిన సందర్భంగా టీడీపీ చెందిన పలువురు సీనియర్‌ నాయకులు లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. వారిలో మాజీ మంత్రులు అలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎన్‌. అమరనాథరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, మీనాక్షినాయుడు, కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు తదితరులు ఉన్నారు. కాగా, యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరిన సందర్భంగా లోకేశ్‌కు సంఘీభావం తెలుపుతూ నెల్లూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు.

ఉదయగిరిలో ఘనస్వాగతం

మంగళవారం సాయంత్రం లోకేశ్‌ పాదయాత్ర కావలి నియోజకవర్గాన్ని దాటి ఉదయగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయగిరి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రతి పల్లెలో మంగళహారతులు పట్టి పూలవర్షం కురిపించారు.

ప్రజలకు భరోసా ఇచ్చేందుకే: లోకేశ్‌

‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిచయం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు భయాన్ని పరిచయం చేశాడు. ప్రజల్లో ఆ భయాన్ని పోగొట్టడానికే నేను యువగళం పాదయాత్ర మొదలుపెట్టాను’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కావలి మండలం కొత్తపల్లిలో జరిగిన రచ్చబండ వేదికపై నుంచి లోకేశ్‌ మాట్లాడారు. ‘‘ధరలు పెరిగినా, ఉపాధి అవకాశాలు లేకపోయినా, అభివృద్ధి పనులు జరగకపోయినా, సంక్షేమ పథకాలు కోత పెట్టినా తమ కష్టంతో తాము బతుకుదామనే ఆశ కూడా ప్రజలకు లేకుండా చేశాడు ఈ జగన్‌. ఆయన నాలుగేళ్ల పాలనలో ప్రజలకు భయాన్ని పరిచయం చేశారు.

రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనివిధంగా ఈరోజు ప్రజలు భయంతో బతుకుతున్నారు. అభద్రతా భావానికి గురవుతున్నారు. రక్షణ లేకుండా జీవిస్తున్నారు.. ప్రజల్లో ఆ భయం పోవాలి. వారిలో చైతన్యం నింపాలి. టీడీపీ అండగా ఉందని ఽధైర్యం చెప్పాలనే యువగళం పాదయాత్ర మొదలుపెట్టా’’ అని లోకేశ్‌ అన్నారు. ‘‘2014లో రాష్ట్రం విడిపోయింది. ఆదాయం తగ్గిపోయింది. బడ్జెట్‌ లోటులో పడిపోయింది.. అయినా ఎవరికీ లోటు రాకుండా పరిపాలించిన నాయకుడు చంద్రబాబు’’ అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 6లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఇప్పుడు జగన్‌ ఏంచేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించాలని లోకేశ్‌ కోరారు. చంద్రబాబు ఎంతో శ్రమించి, నిర్మించిన రాజధానిని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. మూడు రాజధానులంటూ విశాఖపై కన్నేసి, దానిని నేర రాజధానిగా మార్చేశాడని మండిపడ్డారు.

Updated Date - 2023-07-12T02:49:38+05:30 IST