వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ఆరంభం
ABN , First Publish Date - 2023-08-19T00:05:43+05:30 IST
గొలగమూడి వెంకయ్య స్వామి 41వ ఆరాధనోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
గొలగమూడిలో మొదలైన భక్తుల సందడి
వెంకటాచలం, ఆగస్టు 18 : గొలగమూడి వెంకయ్య స్వామి 41వ ఆరాధనోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, స్వామివారి పూజ, హారతి, ప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తికి అభిషేకం, దత్తసంప్రదాయ షోడసోపచార పూజలు జరిగాయి. స్వామి సమాధి మందిరాన్ని పూలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. అనంతరం ఉదయం పది గంటలకు గొలగమూడి గ్రామస్థులచే జరిగిన సర్వభూపాల వాహనంపై స్వామివారు ఊరేగారు. భక్తుల కోలాటం, పండరి భజన, మేళతాళాలు, మంగళ వ్యాయిదాల నడము ఈ ఊరేగింపు వైభవంగా సాగింది. ఆరాధన మొదటి రోజు కావడంతో ఉభయకర్తలతోపాటు భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికానందం పొందారు. అనంతరం రాత్రి వెంకయ్యస్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి విహరించారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడిన వాహనంపై ఊరేగుతున్న వెంకయ్య స్వామిని చూసి తమ జన్మధన్యమైనట్లు భక్తులు పులకించిపోయారు. ఎన్ని రకాల పూలు ఉన్నా కలిపి కడితే అన్నీ ఒకే మాలగా ఉన్నట్లు మనుషులంతా ఒక్కటేనన్న భావనను కలిగించేలా స్వామిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తరలివస్తున్న భక్తుల కోసం ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల్లో నేడు
ఆరాధనోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరించనున్నారు.