సెలవుకు సెలవ్‌పై అయ్యోర్ల ఆగ్రహం!

ABN , First Publish Date - 2023-05-02T23:30:44+05:30 IST

వేసవి సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఉపాధ్యాయలోకం మండిపడుతోంది. కేవలం ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమే తప్ప మరొకటి కాదని ఆగ్రహిస్తోంది. వేసవి సెలవులు విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసినవే తప్ప తమ కోసం కాదన్నారు.

సెలవుకు సెలవ్‌పై  అయ్యోర్ల ఆగ్రహం!

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు

వేసవి సెలవులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఉపాధ్యాయలోకం మండిపడుతోంది. కేవలం ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమే తప్ప మరొకటి కాదని ఆగ్రహిస్తోంది. వేసవి సెలవులు విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసినవే తప్ప తమ కోసం కాదన్నారు. అయితే, ప్రభుత్వం ప్రభుత్వ టీచర్ల మీద ఉన్న కోపంతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందంటున్నారు.

నెల్లూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో వేసవి సెలవులు అనేవి తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. వేసవిలో కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాలలకు వెళ్లడం చిన్న వయస్కులైన విద్యార్థులకు ఆరోగ్యపరంగా మంచిది కాదనే ఉద్దేశంతో ఈ సెలవులు ప్రవేశపెట్టారు. అంతేగాక రీఫ్రె్‌సమెంట్‌ కూడా ఒక కారణం. మేధావి వర్గాల ఆలోచన మేరకు సగటు మనిషి 45 నిమిషాలపాటు మాత్రమే ఏ విషయాన్నైనా ఏకాగ్రతగా వినగలడు, చేయగలడు. ఆ తరువాత కొద్ది నిమిషాల విరామం తరువాతే తిరిగి యథాస్థితికి రాగలరు. ఆ కారణంగానే పీరియడ్‌ సమయాన్ని 45 నిమిషాలుగా నిర్ణయించి అమలు చేస్తున్నారు. ప్రతి 45 నిమిషాల తరువాత సబ్జెట్‌ మార్పు పేరుతో కొద్ది నిమిషాల విరామం దొరుకుంది. ఇలా అధ్యయనాల క్రమంలోనే వార్షిక పరీక్షలు అయ్యాక విద్యార్థికి కాసింత విశ్రాంతి కోసం వేసవి సెలవుల పేరుతో కొన్ని రోజులపాటు పాఠశాలలు మూసేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్త నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేసింది కానీ ఉపాధ్యాయులకు మాత్రం సెలవులు రద్దు చేసింది.

23 అంశాలపై విధులు

వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 23 అంశాలపై విధులు ఉపాధ్యాయులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానోపాఽధ్యాయులు, ఉపాధ్యాయులు చేపట్టవలసిన విధులపై విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాడు-నేడు పనులు, పదోతరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. హెచ్‌ఎం సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడు విధుల్లో ఉండాల్సిందే. ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వహించడంతోపాటు 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంతవరకు వర్క్‌షీట్లను మాత్రం ముద్రించకపోవడం విశేషం. ఉపాధ్యాయులే తమ సొంత నిధులు వెచ్చించి వీటిని జిరాక్స్‌ తీసి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి సారించి ప్రభుత్వ బడుల్లో చేరేలా తల్లిదండ్రులను సంసిద్దులను చేయాలి. ఇలా అన్ని రకాల పనులను వేసవిలో ఉపాధ్యాయులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులు తమను కావాలనే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కక్షసాధింపుతోనేనా..

తమపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడుల్లా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఉపాధ్యాయుల తీరుపై అనుమానంతో ప్రభుత్వం వీరిని ఎన్నికల విధులకు దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి ప్రతిఘటన మరింత ఎక్కువయ్యింది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తరువాత ఉపాధ్యాయుల తిరుగుబాటు మరింతగా పెరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ఎలాగైనా తమను నియంత్రణలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా వేసవి సెలవుల రద్దు పేరుతో వేధింపులకు గురిచేస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు అంటున్నారు.

కుట్రపూరిత నిర్ణయం

- జి.రాజమనోహర్‌, ఎస్టీయూ

ఉపాధ్యాయులపై కక్ష కట్టి ఇలా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వేసవి సెలవులు అనేవి ఎన్నో తరాలుగా వస్తున్నాయి. వీటిని రద్దు చేయడం అనేది దుర్మార్గం. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేసవి సెలవుల్లో వేరే శాఖలకు డిప్యూటేషన్‌ వేసి పనిచేయమన్నా చేస్తాం. అయితే ఆ రోజులకు మాకు ఎర్న్‌ లీవులు ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 రోజులు ఎర్న్‌ లీవు ఇస్తున్నారు. టీచర్లకు మాత్రం 6 రోజులే. మాకూ 30 రోజులు ఇవ్వండి. ఇలాంటి నిర్ణయాల వల్ల టీచర్లు భయపడరు. మాది న్యూట్రన్‌ సిద్ధాంతం. ఎంత బలంగా అణిచివేయాలని చూస్తే అంతకన్నా బలంగా తిరగబడతాం.

ఆందోళనకు గురిచేసే ప్రయత్నమే

- డీవీ. చలపతిశర్మ, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

విద్యార్థుల విశ్రాంతి కోసమే వేసవి సెలవులు. ఇప్పుడు టీచర్ల మీద కోపంతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాసింత రెస్ట్‌ లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నాయని దాడులు చేసే ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల్లోనూ విద్యార్థులకు అదే ఒత్తిడి తెచ్చిపెడుతోంది. నాడు-నేడు పనులు పూర్తి చేసే బాధ్యతను టీచర్లపై ఉంచుతోంది. ఇది కరెక్ట్‌ కాదు. మాకు ఎర్న్‌ లీవులు ఇస్తారా!? ఇవ్వరా!? అనే విషయం స్పష్టం చేయకుండా సెలవులు రద్దు చేసి పనులు పురమాయించడం కరెక్ట్‌ కాదు.

======================

Updated Date - 2023-05-02T23:30:44+05:30 IST