టీడీపీ, జనసేన కలయికతో ప్రభంజనమే
ABN , First Publish Date - 2023-09-24T23:06:28+05:30 IST
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

లింగసముద్రం, సెప్టెంబరు 24 : రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక వేముల అంజయ్య కల్యాణ మండపంలో జనసేన నాయకుడు కొణిదెన శ్రీనివాసులు అధ్యక్షత జరిగిన టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనపై పవనకల్యాణ్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పడం శుభసంకేతమన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ దుర్మార్గపు పాలన అంతమవుతుందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఎక్కడ చూసినా అవినీతి తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. చిన్న ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. లోకేష్, పవన్‌కల్యాణ్‌పై వైసీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరుపార్టీల కార్యకర్తలు అదే సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలన్నారు. కందుకూరు నియోజకవర్గంలో అవినీతి అడ్డూ అదుపు లేదని, మండలానికొక షాడో లీడర్ తయారై ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా వెలుగులోకి తెస్తామని, జన సైనికులు, టీడీపీతో కలిసి సమస్యలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేముల గోపాలరావు, జనసేన మండల అధ్యక్షుడు అంగుళూరి నరసింహారావు, ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్ చల్ల్లా శ్రీనివాసరావు, నేతలు ఎం బ్రహ్మయ్య, బింకం నరేంద్ర, అడపా శ్రీనివాసరావు, షేక్ నాయబ్‌రసూల్, పి మాల్యాద్రి, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.