ఊరూరా బకాసురులే!

ABN , First Publish Date - 2023-05-26T23:24:30+05:30 IST

ఇసుక డబ్బు నేరుగా సీఎం నివాసానికి వెళుతోంది..! అని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. దీనిని స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా బలంగా విశ్వసించారో ఏమో!? మీరు టిప్పర్లతో కొల్లగొడితే మేము ట్రాక్టర్లతో అయినా దోచేయకపోతే ఎలా!? అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

 ఊరూరా  బకాసురులే!
బుచ్చి : జొన్నవాడ పెన్నానదిలో ఇసుకను టిప్పర్లకు లోడ్‌ చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

ఇసుకాసురుల దాహంతో తరిగిపోతున్న ప్రకృతి సంపద

పెన్నాలో జేపీ కంపెనీ అడ్డగోలు తవ్వకాలు

వాగులు, వంకలను వదలని వైసీపీ నాయకులు

ట్రాక్టర్లకు లెక్కగట్టి అధికారులకు మామూళ్లు

నెల్లూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఇసుక డబ్బు నేరుగా సీఎం నివాసానికి వెళుతోంది..! అని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. దీనిని స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా బలంగా విశ్వసించారో ఏమో!? మీరు టిప్పర్లతో కొల్లగొడితే మేము ట్రాక్టర్లతో అయినా దోచేయకపోతే ఎలా!? అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాంట్రాక్టు పేరుతో జేపీ కంపెనీ పెన్నానదిని కుల్లబొడిచేస్తుంటే అధికార పార్టీ నాయకులు ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ వాగులు, వంకల్లో ఇసుకను నమిలి మింగేస్తున్నారు. జేపీ కంపెనీ అడ్డగోలు తవ్వకాలను అడ్డుకోవడం కాదు.. అటువైపు తొంగి చూసే ధైర్యం కూడా లేని అధికారులు ఎక్కడికక్కడ స్థానిక అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ‘వాగులు, వంకలు కొల్లగొట్టండి. మీరు కొంత తినండి.. మాకు ఇంత అని ఇచ్చేయండి.’ అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తమ్మీద ఇసుక నిక్షేపాలు పుష్కలంగా ఉండే జిల్లాలో భావితరాలకు ఇసుక దొరకని పరిస్థితులు తీసుకొస్తున్నారు. పెన్నానది పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకల పరిసరాల్లో 20 నుంచి 30 అడుగుల లోతునే బోరుబావులకు నీరందే ఈ జిల్లాను 400 అడుగుల లోతుకు వెళితే తప్ప నీటి చుక్క కనిపించని రాయలసీమ జిల్లాల సరసన చేర్చడానికి సిద్ధం అవుతున్నారు.

నిబంధనలు గాలికి..

నిబంధనల ప్రకారం రీచ్‌లలో ఒక మీటరు కన్నా ఎక్కువ లోతుకు ఇసుక తవ్వకాలు జరగకూడదు. అంతకు మించి తవ్వకాలు జరిగితే పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోతుంది. సాగు, తాగునీటికి ఇక్కట్లు తప్పవు. కానీ జిల్లా పరిధిలోని అధికారిక రీచ్‌లకు వెళ్లి చూస్తే కడుపు రగిలిపోతోంది. మీటరు కాదు.. ఐదు నుంచి ఆరు మీటర్ల లోతు వరకు ఇసుక కోసం తవ్వేస్తున్నారు. అటువైపు కన్నెత్తి చూసే దమ్ము, ధైర్యం అధికారులకు ఉండటం లేదు. అసలు అధికారులే కాదు జేపీ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే ఏ రీచ్‌లోకి సామాన్యులకు అనుమతి లేదు. ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలకు కూడా రానివ్వడం లేదు. కాంట్రాక్టు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఐదారు మీటర్ల లోతుకు తవ్వేస్తున్నారు.

ఆవు చేను మేస్తే..

ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా!? అనే సామెతలా కాంట్రాక్టు పేరుతో వైసీపీ అగ్రనాయకుడు అధికారిక రీచ్‌లో అడ్డదిడ్డంగా తవ్వకాలు జరుపుతుంటే వీరిని స్ఫూర్తిగా తీసుకొని స్థానిక వైసీపీ నాయకులు తమకు అందుబాటులో ఉన్న వాగులు, వంకల మీద పడి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పెన్నానది ఇసుక మట్టాన్ని పెద్ద గుత్తేదారు మట్టుపెడుతుంటే.. చిన్న చితక వాగులు, వంకల్లోని కొద్దిపాటి ఇసుక నిక్షేపాలను కొందరు అధికార పార్టీ నాయకులు మింగేస్తున్నారు.

కలువాయి మండలం నుక్కనపల్లి తెలుగురాయపురం సమీపంలో పెన్నా నదిలో నుంచి రాత్రిపూట ఇసుక తరలిస్తున్నారు. పోలీసులను మచ్చిక చేసుకొని తమ పని కానిచ్చేస్తున్నారు.

మర్రిపాడు మండలం అల్లంపాడు, నందవరం, సస్నవారిపల్లి, బొగ్గేరులలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అధికారులు లెక్కగట్టి నెల మామూళ్లు వసూలు చేసుకొంటున్నారు.

సంగం మండలంలోని కోలగట్ల, మక్తాపురం మీదుగా అనధికారిక రీచ్‌ల నుంచి రాత్రివేళల్లో వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అధికారులకు నెలకు ఒక్కో వాహనానికి రూ.45వేలు చొప్పున మామూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం.

అనంతసాగరం మండల పరిధిలోని పెన్నా పరీవాహిక ప్రాంతాలైన పాతదేవరపల్లి, లింగంగుంట, ఇసుకపల్లి నుంచి ఇసుక స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. ఇదంతా తెలిసినా మామూళ్ల మత్తులో అధికారులు మౌనంగా ఉన్నారు

నెల్లూరు రూరల్‌ మండలం కోడూరుపాడు నుంచి ప్రతి రోజు పెన్నా నది ఇసుక ట్రాక్టర్ల ద్వారా నెల్లూరు నగరానికి తరలిస్తున్నారు. రోజుకు సుమారుగా వంద లోడ్ల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

ఏఎ్‌స పేట మండలం చందలూరుపాడు, గుంపర్లపాడు గ్రామ సమీపంలోని నక్కల వాగులో ప్రతిరోజు రాత్రి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. విషయం తెలిసినా అధికారులకు అడ్డుకునే ధైర్యం లేదు.

ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద రీచ్‌ నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

లింగసముద్రం మండలం తూనుగుంట, గుడ్లూరు, మండలం దప్పళంపాడు, కందుకూరు మండలం దొండపాడు, ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామాల పరిధిలోని మన్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఽఅధికారులకు వారం, వారం మామూళ్లు ఇచ్చి దర్జాగా ఇసుక దోచేస్తున్నారు.

చేజర్ల మండలం మాముడూరు, కోటితీర్థం ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

సైదాపురం మండలం రామసాగరం గ్రామ పరిధిలోని కైవల్యానది నుంచి రాత్రి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

కొండాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఉప్పుటేరు, పిల్లేరు, మన్నేరు, వాగులగండి వాగుల నుంచి యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.

==================

Updated Date - 2023-05-26T23:24:30+05:30 IST