శనగరైతు సుడి తిరిగింది !

ABN , First Publish Date - 2023-08-22T00:10:15+05:30 IST

శనగల మార్కెట్‌ జోష్‌ మీదుంది. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు ధర పెరుగుతోంది. రెండు నెలల క్రితం వరకు క్వింటం రూ. 7,500కి మించి పలకని కాగ్‌-2 రకం శనగల ధర ప్రస్తుతం రూ.12వేలకుచేరింది.

శనగరైతు సుడి తిరిగింది !
కాగ్‌ 2 రకం శనగలు

కాగ్‌-2 రకం క్వింటాల్‌ రూ.12 వేలు

జేజే-11 రకం ధరలోనూ మార్పు

విశ్వవిపణిలో డిమాండే కారణం

పదేళ్ల రికార్డు మళ్లీ నమోదు

కందుకూరు, ఆగస్టు 21: శనగల మార్కెట్‌ జోష్‌ మీదుంది. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు ధర పెరుగుతోంది. రెండు నెలల క్రితం వరకు క్వింటం రూ. 7,500కి మించి పలకని కాగ్‌-2 రకం శనగల ధర ప్రస్తుతం రూ.12వేలకుచేరింది. మరికొద్దిరోజుల్లో రూ.15వేలకు చేరుకోనున్నదని వ్యాపారులు, రైతులు ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా రూపాయి కూడా పెరగని దేశీయరకమైన జేజే-11 రకం(ఎర్రశనగలు) ధరలోనూ మార్పు కనిపిస్తోంది. మొన్నటివరకు క్వింటాల్‌ రూ.4,800లకు మించి పలకని ఈ రకం ప్రస్తుతం రూ.6వేలకు చేరింది. కాగ్‌-2 రకం శనగలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఏర్పడటం, దేశీయ ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉండటంతో ధర అనూహ్యంగా పెరిగింది.

పదేళ్లనాటి రికార్డు నమోదు

సరిగ్గా పదేళ్లక్రితం శనగలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఏర్పడటంతో అప్పట్లో కూడా శనగల ధరలు పెరిగాయి. అప్పట్లో కాగ్‌-2 రకం క్వింటాల్‌ రూ. 11వేలు, జేసే-11 రకం రూ. 7వేల వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏటేలా ధరలు దిగజారుతూ వచ్చాయి. ఈ ఏడాది మాత్రం కాగ్‌-2 రకం పంట ఉత్పత్తులు రైతుల ఇళ్లకు చేరింది మొదలు రూ. 7,200 నుంచి రూ. 7,700 వరకు సరుకు నాణ్యతను వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే జేజే-11రకం మాత్రం క్వింటాల్‌కు రూ. 4,,800కి మించి ధర పలకకపోవటంతో మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశారు. అయితే రెండు నెలలు తిరగకుండానే అనూహ్యంగా ధర పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌

దేశం నుంచి ప్రస్తుతం ఇతర దేశాలకు శనగల ఎగుమతులు పెద్దగా లేకపోయినా, దేశీయ ఎగుమతులు బాగానే ఉన్నాయి. ఇదే ధర పెరుగుదలకు కారణంగా మార్కెట్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శనగలు పండించే దేశాలలో కూడా దిగుబడులు గణనీయంగా తగ్గాయి.ఈ నేపథ్యంలో శనగల వినియోగం అధికంగా ఉండే దేశాలు అధికధర చెల్లించైనా దిగుమతి చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా శనగలకు డిమాండ్‌ ఏర్పడి ధర పెరిగింది. మనదేశంలో కూడా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కాగ్‌-2 రకం శనగల వినియోగం అధికంగా ఉంది. అలాగే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు పౌరసరఫరాల శాఖ ద్వారా కాగ్‌-2 రకం శనగలను సబ్సిడీతో సరఫరా చేస్తున్నాయి. అత్యంత మేలురకం శనగలను మాత్రమే అనుమతించే ఆ రాష్ట్రాలు ప్రస్తుతం క్వింటాల్‌కి రూ. 13,500వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.గణపతి నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా జేజే- 11 రకం శనగల వినియోగం అధికంగా ఉండనున్న నేపథ్యంలో వాటిధరలు కూడా రానున్న రోజుల్లో పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

వ్యాపారులకు పంట

ఇటీవల శనగలు క్వింటాల్‌కు రూ. 4వేలకు పైగా ధర పెరగటంతో వ్యాపారుల పంట పండిందని భావిస్తున్నారు. ఒక్క లారీకి (పది టన్నులకు) 4 లక్షలకు పైగా నికరంగా లాభం వస్తుండటం, భవిష్యత్తులో మరింత ధర పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఈ ఏడాది మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. కందుకూరు ప్రాంతంలోనే మూడు వందల లారీలకుపైగా శనగలు ఉత్పత్తి అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

===================

Updated Date - 2023-08-22T00:10:15+05:30 IST