సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు
ABN , First Publish Date - 2023-03-31T23:27:22+05:30 IST
ప్రజాస్వామ్యంలో సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని ఏపీ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి అన్నారు.
పొదలకూరు, మార్చి 31 : ప్రజాస్వామ్యంలో సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని ఏపీ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పొదలకూరులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనమే ఆర్టీఐ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సానుకూల దృక్పథంతో ఇరువర్గాలు వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 4 (1) బీ సమాచారాన్ని తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 (1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అప్పీళ్ల సంఖ్య పెరిగినట్లు చెప్పారు. జిల్లాల్లో విచారణలు నిర్వహించేందుకు ఏప్రిల్, మే నెలల్లో అనంతపురం, నెల్లూరులో క్యాంపు కోర్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాచారం ఇవ్వకుండా, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తహసీల్దారు ఐఎస్.ప్రసాద్, పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్‌ఐ కరీముల్లా, వీఆర్‌వో శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల వినతి
పొదలకూరు మండల అధికారులు సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, వాళ్లు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడతాయని అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడులు ఏపీ ఆర్టీఐ కమిషనర్ హరిప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. నావూరపల్లి చెరువు పనుల్లోను, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో మస్టర్ల ద్వారా రూ.7కోట్లకుపైగా డ్రా అయినట్లు తెలిపారు. జగనన్న లే అవుట్లు, ఉపాధి పనులు ఇలా అనేక చోట్ల అవకతవకలు జరిగినట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఆ వివరాలను తన మెయిల్‌కు పంపాలని సూచించారు.
=======