భక్తసుగంధం
ABN , First Publish Date - 2023-07-31T00:05:24+05:30 IST
కోరిన కోరికలు నెరవేర్చే రొట్టెల పండుగకు భక్తజనం తరలివచ్చింది. మతసామరస్యానికి అతీతంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో నెల్లూరు నగరం పోటెత్తింది.
కిక్కిరిసిన నెల్లూరు నగరం
వైభవంగా గంధ మహోత్సవం
అర్ధరాత్రి తర్వాత గంధం బెందెల ఊరేగింపు
నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం
కోరిన కోరికలు నెరవేర్చే రొట్టెల పండుగకు భక్తజనం తరలివచ్చింది. మతసామరస్యానికి అతీతంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో నెల్లూరు నగరం పోటెత్తింది. దారులన్నీ బారాషహీద్ దర్గానే చూపాయి. రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే వారితో స్వర్ణాల తీరం మురిసింది.
వరాల రొట్టెలు పట్టుకునే వారు ఒకవైపు, తీరిన కోర్కెలతో మొక్కులు చెల్లించుకునే వారు మరోవైపు, బారా షహీద్‌లను భక్తిశ్రద్ధలతో దర్శించేవారు ఇంకోవైపు... వెరసి స్వర్ణాల తీరం భక్తజన సంద్రమైంది. రొట్టెల పండుగలో రెండవరోజు ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. వరాల రొట్టెల కోసం వందల, వేల మైళ్లు దాటుకుని వచ్చారు. అర్ధరాత్రి గంధం మహోత్సవాన్ని తిలకించేందుకు, భక్తి సు‘గంధం’ పొందేందుకు అశేషంగా హాజరయ్యారు. ఫకీర్ల పాటలు, విన్యాసాలతో గంధోత్సవం వైభవంగా జరిగింది.
నెల్లూరు (సాంస్కృతికం), జూలై 30 : కోర్కెలు తీర్చే వరాల రొట్టెల పండుగకు ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు కశ్మీర్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లోని పలు జిల్లాల నుంచి కుటుంబ సభ్యలతో కలిసి వచ్చి వరాల రొట్టెలు పట్టుకున్నారు. కోర్కెలు తీరిన రొట్టెలను వదిలారు. స్వర్ణాల చెరువు ఘాట్‌లో రొట్టెల కోసం బారులుతీరడం, వెదుకులాటలు కనిపించాయి. ఉద్యోగ రొట్టె కోసం యువత పోటీపడగా, చదువు, ఆరోగ్యం, సౌభాగ్యం, రొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఇక బారులు తీరిన క్యూలైన్లలో భక్తులు నిరీక్షించి బారాషహీద్‌లను దర్శించుకున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మూడు లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్టు అంచనా. మరోవైపు రాత్రి 8 గంటలపైన తన బంగ్లా నుంచి దర్గా వరకు నడిచి వచ్చిన కలెక్టర్ హరినారాయణన్ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వాణిజ్య సముదాయాలు కళకళ
దర్గా సముదాయంలో ఏర్పాటైన దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ అంగళ్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. రొట్టెల పండుగకు వచ్చిన జ్ఞాపకాలను మరిచిపోకుండా ఏదో ఒక వస్తువును యాత్రికులు కొనుగోలు చేయడంతో దుకాణాల వద్ద రద్దీగా నెలకొంది. పారిశుధ్యం, తాగునీరు, భక్తుల క్యూలైన్లు, రద్దీని తొలగించడం, భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో జేసీ కూర్మనాథ్, ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, ఇతర అధికారులు దర్గా మైదానంలో పర్యటిస్తూ భక్తులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. భక్తులకు సేవలు చేస్తామని దర్గా కమిటీలో పదవులు పొందిన నాయకులు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి అనుచరులు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. దర్గాలో తమవారికి దర్శనం కల్పించడంలోనే నిమగ్నమయ్యేరే తప్ప భక్తుల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు దర్గాను దర్శించుకుని, జగన్మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ రొట్టెను అందుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన కుటుంబ సభ్యులతో విచ్చేసి బారషహీద్‌లకు పూజలు చేశారు. బారాషహీద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిగింది.
వైభవంగా గంథమహోత్సవం
రొట్టెల పండుగలో ప్రధానమైన బారాషహీద్‌ల గంథ మహోత్సవం అర్ధరాత్రి జరిగింది. కోటమిట్టలోని అమీనియా మసీదులో మతపెద్దలు 12 బిందెలలో సంప్రదాయబద్ధంగా గంధం కలిపారు. అనంతరం పూలరథంపై ఆ బిందెలను పెట్టుకుని కోటమిట్ట, పాత జడ్పీ ఆఫీసు, నెహ్రూబొమ్మ, కేవీఆర్ పెట్రోలు బంకుల మీదుగా ఊరేగింపుగా బారాషహీద్ దర్గాలోని ఈద్గాకు తీసుకొచ్చారు. అక్కడ గంధం బిందెలకు ప్రత్యేక పూజలతోపాటు బారాషహీద్‌ల వీరత్వం మహత్యంపై ఫకీర్‌లు గానం చేస్తూ సాహకృత్యాలను ప్రదర్శించారు. సోమవారం తెల్లవారు జామున భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రధాన బిందెను గుర్రంపై పెట్టుకుని దర్గాకు చేరుకున్నారు. గంధంను కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ ఆయన శిష్యబృందం ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధం ఎక్కించారు. ఆ తర్వాత గంధం ప్రసాదం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ మహోత్సవానికి జిల్లా అధికారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమం అనంతరం రొట్టెల పండుగ ఆరంభమైంది.
నేడు ‘స్పందన’ రద్దు
రొట్టెల పండుగ సందర్భంగా సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
కోర్కెల పండుగకు వచ్చి కానరాని లోకాలకు...
రైలు ఢీకొని తల్లీకూతురు మృతి
నెల్లూరు (క్రైం), జూలై 30 : కోర్కెలు తీర్చుకోవాలని నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వచ్చిన ఇద్దరు మహిళలు రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు... గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఫాతిమున్నీసా(60)కు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ వివాహమైంది. పెద్ద కుమార్తె మెహరున్నీసా శింగరాయకొండ, చిన్నకుమార్తె గౌసియా(35) కందుకూరులో ఉంటున్నారు. రొట్టెల పండుగకు తల్లీకూతుళ్లు ఆదివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు వచ్చారు. బారా షహీద్ దర్గాను సందర్శించి, రొట్టెలు పట్టుకుని హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఫాతిమున్నీసా, గౌసియా మూత్రవిసర్జన కోసం రైలుపట్టాలపై ఆత్మకూరు బస్టాండు వైపు నడుచుకుంటూ వెళ్లారు. రైల్వే బ్రిడ్జిపైకి వచ్చే సరికి నిజాముద్దీన్ వెళుతున్న రైలు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫాతిమున్నీసా అక్కడిక్కడే మృతి చెందగా గౌసియా బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆమెను స్థానికులు 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటన స్థలాన్ని రైల్వే ఎస్‌ఐ హరిచందన పరిశీలించి ఫాతిమున్నీసా మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతురాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి, చెల్లెలు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మెహరున్నీసా బిగ్గరగా ఏడుస్తూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.
========================