ప్రయాణికుల సౌకర్యార్థం స్టార్‌లైనర్‌ సర్వీసులు

ABN , First Publish Date - 2023-03-18T22:59:29+05:30 IST

దూరప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం స్టార్‌లైనర్‌ బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారి పీవీ శేషయ్య పేర్కొన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం స్టార్‌లైనర్‌ సర్వీసులు
ఉదయగిరి డిపోలో టూల్స్‌ పరిశీలిస్తున్న ఆర్‌ఎం శేషయ్య

ఉదయగిరి రూరల్‌, మార్చి 18: దూరప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం స్టార్‌లైనర్‌ బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారి పీవీ శేషయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపోలోని అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని కందుకూరు, నెల్లూరు డిపోల నుంచి స్టార్‌లైనర్‌ సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. త్వరలో ఉదయగిరి డిపో నుంచి హైదరాబాదు, బెంగుళూరు తదితర ప్రాంతాలకు నడుపుతామన్నారు. అలాగే కర్నూలు, శ్రీశైలం ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రతినెలా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం అరుణాచలంకు బస్సు సర్వీసు నడుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

========

Updated Date - 2023-03-18T22:59:29+05:30 IST