ప్రజాధనమంటే లెక్కలేదా ?

ABN , First Publish Date - 2023-09-25T00:09:43+05:30 IST

వందలు, వేలు కాదు... కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా.. ఆడిట్‌ అధికారులు తప్పుబట్టినా మాకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

 ప్రజాధనమంటే లెక్కలేదా ?
అధ్వానంగా ఉన్న ఆత్మకూరు - సోమశిల రోడ్డు

నాణ్యతలోపంతో ఆత్మకూరు-సోమశిల రోడ్డు

మొత్తం పనినే రద్దు చేసిన సీఈ

కాంట్రాక్టరు నుంచి బిల్లుల రికవరీకి ఆదేశం

ఎనిమిదేళ్లు కావస్తున్నా పట్టించుకోని వైనం

కానీ ఇప్పటికీ బీజీల రెన్యువల్‌

గతేడాది తప్పుబట్టిన ఆడిట్‌ అధికారులు

మారని అధికార యంత్రాంగం తీరు

వందలు, వేలు కాదు... కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా.. ఆడిట్‌ అధికారులు తప్పుబట్టినా మాకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. జరిగింది పెద్ద తప్పు.. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆత్మకూరు-సోమశిల రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకల వ్యవహారం ఆర్‌అండ్‌బీ అధికారుల పనితీరును ఎత్తిచూపుతోంది. ఈ రోడ్డు నిర్మాణం నాణ్యతగా లేదని ఎనిమిదేళ్ల క్రితం క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మొత్తం వర్కునే రిజక్ట్‌ చేశారు. సదరు కాంట్రాక్టర్‌ నుంచి బిల్లులు రికవరీ చేయడంతోపాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా నేటికీ పట్టించుకోలేదు.

నెల్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఆత్మకూరు-సోమశిల రోడ్డు అభివృద్ధికి ఎనిమిదేళ్ల క్రితం టెండర్లు పిలిచారు. కిలోమీటరు 17 నుంచి కిలోమీటరు 40 వరకు రెండు వరుసల రోడ్డు విస్తరణకు సుమారు రూ.25 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఓ కాంట్రాక్టర్‌ ఈ వర్కును 16శాతం లెస్‌కు దక్కించుకున్నారు. 2015లో రోడ్డు పనులు జరగ్గా కొందరు స్థానికులు నాణ్యత లోపంగా పనులు జరుగుతున్నాయని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర అధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి.దీంతో అప్పటి క్వాలిటీ కంట్రోల్‌ సీఈనే విచారణకు వచ్చారు. రోడ్డు నాణ్యతను పరిశీలించి నాణ్యత లేదని నిర్ధారించారు. అప్పటివరకు జరిగిన పనులు కూడా ఇదే మాదిరిగా జరగడంతో ఆ పనినే రద్దు చేశారు. అప్పటికే సదరు కాంట్రాక్టర్‌కు రూ.కోట్ల బిల్లులు చెల్లించారు. దీంతో ఆ బిల్లులను రికవరీ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే సదరు కాంట్రాక్టర్‌కు ఎంత బిల్లులు చెల్లించారన్న విషయాన్ని మాత్రం ఆర్‌అండ్‌బీ అధికారులు వెల్లడించలేదు. ఇదే సమయంలో నాణ్యతను పరిశీలించని సంబంధిత అధికారులపైనా చర్యలకు సిఫార్సు చేశారు. ఇదంతా జరిగి ఇప్పటికి ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఆ ఫైల్‌ ఇప్పటికీ బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలుమార్లు రాష్ట్ర అధికారులు దీనిపై రిమైండర్లు పంపినా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోలేదని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి.

ఏటా బీజీ రెన్యువల్‌

సాధారణంగా ఒక వర్కుకు టెండర్‌ వేసేటప్పుడు బ్యాంకు గ్యారెంటీ(బీజీ)ను అందజేయాలి. సదరు కాంట్రాక్టర్‌ వర్కును పూర్తి చేసి నిర్వహణ పీరియడ్‌ కూడా ముగిశాక సదరు బీజీను అధికారులు తిరిగి ఇచ్చేస్తారు. అప్పటితో ఆ వర్కు ముగిసినట్లవుతుంది. ఆ తర్వాత గానీ ఆ రోడ్డును మళ్లీ అభివృద్ధి చేయడం గానీ లేక నిర్వహణ చేయడానికి గానీ టెండర్లు పిలవడం సాధ్యపడదు. కానీ ఆత్మకూరు-సోమశిల రోడ్డు వర్కు విషయంలో ఇప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు నాణ్యత లోపంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌ బీజీను ప్రతీ ఏటా రెన్యువల్‌ చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్‌ కూడా సుమారు రూ.55 లక్షల బీజీలను ఠంచనుగా రెన్యువల్‌ చేసి ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఒక వర్కు బీజీను రెన్యువల్‌ చేస్తున్నారంటే ఆ వర్కు ఇంకా ఫోర్స్‌లో ఉన్నట్లు అర్థం. కానీ ఇక్కడ వర్కు మాత్రం రిజెక్ట్‌ అయ్యింది.. బీజీలు మాత్రం రెన్యువల్‌ అవుతున్నాయి. మరో విచిత్రమేమిటంటే ఈ వర్కును క్లోజ్‌ చేయకుండానే ఆత్మకూరు-సోమశిల రోడ్డుకు ఈ ఎనిమిదేళ్ల కాలంలో పలుమార్లు టెండర్లు పిలిచారు. కొంత దూరం బీటీ రోడ్డు, కొంత దూరం సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేశారు. ఆ తర్వాత నిర్వహణకు కూడా టెండర్లు పిలిచారు. ఇది ఇంకా పెద్ద తప్పు అని ఇంజనీర్లు చెబుతున్నారు.

ఆడిట్‌ అధికారుల విస్మయం

గతేడాది ఆడిట్‌ అధికారులు ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ కార్యాలయంలో ఆడిటింగ్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఆత్మకూరు-సోమశిల రోడ్డు రిజెక్ట్‌ వర్కును కూడా ఆడిటింగ్‌ చేశారు. దీనిపై సదరు ఆడిటింగ్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంట్రాక్టర్‌ నుంచి ఎందుకు రికవరీ చేయలేదు..? వర్కును ఇంకా ఎందుకు క్లోజ్‌ చేయలేదు..? క్లోజ్‌ చేయకుండానే మళ్లీ టెండర్లు ఎలా పిలిచారు..? వంటి ప్రశ్నలు వేయగా అధికారుల నుంచి సమాధానాలు లేవని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నారని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. మరోమారు ఈ ఏడాది కూడా బీజీ రెన్యువల్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తప్పును సరిదిద్దాల్సిన అధికారులు తప్పు మీద తప్పు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే అనేక మంది అధికారుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తుది ఆదేశాలు అందలేదు...

ఆత్మకూరు-సోమశిల రోడ్డు పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు రిపోర్టు రాశారు. దాని ప్రకారమే వర్కు క్లోజ్‌ చేయకుండా బీజీలను రెన్యువల్‌ చేస్తున్నాం. దీనికి సంబంధించి హెచ్‌వోడీ నుంచి ఇంకా తుది ఆదేశాలు అందలేదు. అవి వచ్చాక చర్యలు తీసుకుంటాం.

- మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ నెల్లూరు ఈఈ

----------

Updated Date - 2023-09-25T00:09:43+05:30 IST