పేదలకు దక్కని పక్కాగృహాలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:58 PM
నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైంది. అధికారులు మాత్రం గిరిజనుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డు మార్జిన్లు,
రోడ్డుమార్జిన్లు, కాలువ గట్లు, చెరువు కట్టలపై ఆవాసం
అందరికీ ఇళ్లు... సంపన్నులకే పరిమితం !
గిరిజనుల దరిచేరిన జగనన్న ఇళ్లు
అల్లూరు, డిసెంబరు 18: నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైంది. అధికారులు మాత్రం గిరిజనుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డు మార్జిన్లు, కాలువ గట్లు, చెరువు కట్టలపై పూరిపాకల్లో నివసిస్తున్నాయి. జిల్లాలో దాదాపుగా ఇలాంటి కుటుంబాలు సుమారుగా మూడు వేల పైచిలుకే ఉన్నాయి.
గిరిజనులకు దక్కని గృహాలు
ప్రతీ ఒక్కరికీ ఇళ్లు పథకం గిరిజనులకు అందుబాటులో లేకుండా పోయింది. గృహం ఉన్నవారికి కూడా మరో గృహం ఇస్తున్నారు కానీ, గిరిజనుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఇందుకు కారణం ఎవరో తెలియనప్పటికీ కనీసం స్పందించే అధికారి కాని, నాయకుడు కాని లేడు. ఎన్నికల సమయంలో మాటలు చెప్పి వారిని మభ్యపెట్టే నేతలేకాని వారి గురించి పట్టించుకోవడంలేదు.
ఇల్లు కట్టుకునే స్థోమత లేదు..
కూలినాలీ చేసుకొని జీవించే కడుపేదలు గిరిజనులు. వీరికి దొరికే కర్రలు, ఆకులతో గుడిసెలు నిర్మించుకుని జీవించడం వారికి అలవాటు. ఇలాంటి వారికి గృహాలు మంజూరు చేసినా నిర్మించుకునే స్థోమత లేదు. దీంతో దశాబ్దాలుగా రోడ్డు మార్జిన్లు, కాలువ గట్లు, చెరువు కట్టలపైనే కాపురం ఉంటున్నారు. అల్లూరు మండలం తూర్పు గోగులపల్లిలో రోడ్డు మార్జిన్‌లో దాదాపుగా 30 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నాయి. వానొచ్చినా, ఎండ కాసినా, అగ్నిప్రమాదాలు జరిగినా వీరి పరిస్థితి ఆగమ్యగోచరమే.
గుర్తింపు ఏది ?
జిల్లాకు దాదాపు 86,122 గృహాలను పేదలకు మంజూరు చేశారు. వాటిలో 13వేల పైచిలుకు గృహాలు పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కానీ గిరిజనులకు మాత్రం పక్కా గృహాలు మంజూరు చేయలేదు. జగనన్న కాలనీలో కూడా ఇళ్ల పట్టాలు దక్కలేదు. అధికారులు కూడా వీరిని గుర్తించకపోవడం దారుణం. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు స్పందించి గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయాల్సి ఉంది.