పార్లపల్లి కో- ఆపరేటివ్‌ సొసైటీలో రూ.3 కోట్లు గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2023-03-30T23:13:48+05:30 IST

మండలంలోని పార్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీలో సుమారు రూ.3కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

పార్లపల్లి కో- ఆపరేటివ్‌ సొసైటీలో   రూ.3 కోట్లు గోల్‌మాల్‌
పార్లపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయం

రైతులకు నోటీసులు జారీ చేసిన అధికారులు

విడవలూరు, మార్చి 30: మండలంలోని పార్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీలో సుమారు రూ.3కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సొసైటీ పాలకులు, అధికారులు కుమ్మకై రైతులు జమ చేసిన నగదును ఖజానాకు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. వారం రోజుల క్రితం జిల్లా అధికారులు బకాయిలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఖజానాకు జమ చేయకుండా నగదు స్వాహా

చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం పార్లపల్లిలో సుమారు 40ఏళ్ల క్రితం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటి నుంచి నేటి వరకు సుమారు రూ.4కోట్ల మేర 500కు పైగా రైతులకు బర్రెలు, క్రాప్‌ లోన్లు, మోటారు వాహనాలకు రుణాలను తక్కువ వడ్డీకే సొసైటీ ద్వారా ప్రభుత్వం అందజేసింది. సొసైటీలో తీసుకున్న రుణాలకు సంబందించి రైతులు క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించారు. అయితే పాలకులు, అధికారులు కుమ్మకై రైతులకు దొంగ రసీదులను అందజేశారు. దీంతో రైతులు బకాయిలు ఉన్నట్లు రికార్డులో పొందుపరిచారు. ఇలా 1987 నుంచి నేటి వరకు తీసుకున్న రుణాలకు సంబందించిన నగదు లావాదేవీల్లో సుమారు రూ.3కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రైతులకు నోటీసుల జారీ

వారం రోజుల క్రితం సొసైటీలో రుణాలు తీసుకున్న సుమారు 444 మంది రైతులకు నోటీసులు అందాయి. మీరు సొసైటీలో రుణాలు తీసుకున్నారని, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాగా గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినా నోటీసులు ఎలా ఇస్తారని జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు పార్లపల్లి సొసైటీలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించింది. అయితే రసీదులు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని, లేనివారు తీసుకున్న రుణాలు చెల్లించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడో చెల్లించిన రుణాలకు సంబంధించిన రసీదులు ప్రస్తుతం తమ వద్ద లేవని, చాలాకాలంగా బకాయిలు చెల్లించకపోతే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి స్థాయిలో విచారణ

పార్లపల్లి వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నోటీసులు అందిన రైతులు బకాయిలు చెల్లించినట్లు ఆధారాలు చూపించాలని కోరామన్నారు.

- సునీల్‌ కుమార్‌, సొసైటీ విచారణాధికారి

==========

Updated Date - 2023-03-30T23:13:48+05:30 IST