నిర్బంధాలకు భయపడం.. : రెహనాబేగం
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:11 PM
నిర్బంధాలకు భయపడేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రెహనాబేగం పేర్కొన్నారు. అంగన్‌వాడీలు సోమవారం ట్రంకురోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. ఆర్డీ
కావలిటౌన్, డిసెంబరు18: నిర్బంధాలకు భయపడేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రెహనాబేగం పేర్కొన్నారు. అంగన్‌వాడీలు సోమవారం ట్రంకురోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. ఆర్డీవో కార్యాలయం వద్దే భోజనాలు తిని సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం వల్లే నిరవధిక సమ్మెకు దిగాల్సివచ్చిందన్నారు. గతంలో టీడీపీ అంగన్‌వాడీలకు న్యాయం చేయకుండా ఓడిపోయిందని, వైసీపీకి అదే దుస్ధితి తప్పదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పెంచలయ్య, మాల్యాద్రి, కృష్ణమోహన్, యూనియన్ నాయకులు రఘురామమ్మ, విజయలత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు : ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కందుకూరులో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి, నిరసనను తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మున్సిపాలిటీలోని అంగన్‌వాడీలతోపాటు వరికుంటపాడు మండలం నుంచి కూడా కార్యకర్తలు, ఆయాలు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ కందుకూరులో భారీ ర్యాలీ నిర్వహించటంతోపాటు పోస్టాఫీసు సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేశారు. అనంతరం సబ్ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సీఐటీయూ నాయకులు జి. వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, ఎస్‌ఏ గౌస్, అంగన్వాడీల సంఘం నాయకులు ఆర్. సరస్వతి, వాకా లతారెడ్డి, ప్రభావతి, అనూరాధ, ఎస్కే రహంతున్నీషా, రాజేశ్వరి, సిహెచ్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.