నేటి నుంచి చవితి సంబరాలు
ABN , First Publish Date - 2023-09-18T00:53:04+05:30 IST
విఘ్నాలను హరించే గణనాథుడి జన్మదినమే వినాయక చవితి. ఈ వేడుకలను జిల్లాలో సోమ, మంగళవారాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకోనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.

ఆలయాలు, ప్రత్యేక వేదికలపై ఏర్పాట్లు
భగ్గుమన్న పూజాద్రవ్యాలు
నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 17: విఘ్నాలను హరించే గణనాథుడి జన్మదినమే వినాయక చవితి. ఈ వేడుకలను జిల్లాలో సోమ, మంగళవారాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకోనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఆది దంపతుల ప్రథమ సంతానం విఘ్నేశ్వరుడు. ఆయన్ను పూజించేనదే ఏ పనిని ప్రారంభించరు. వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే. అందుకని వినాయక చవితిని కులమత, ప్రాంతభేదాలు లేకుండా చిన్నాపెద్దా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చవితి వేడుకలను అన్ని ఆలయాల్లోనూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లోనూ 3, 5, 7, 9 రోజుల చొప్పున నిర్వహిస్తారు. విద్యార్థులు చదువులో రాణించాలని, యువత వృత్తి, వ్యాపారాల్లో ఎదగాలని, ఉద్యోగులు పదోన్నతి పొందాలని గణనాథుడికి పూజలు చేస్తారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రతి రాజకీయ నేత విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తారు. వినాయక చవితి నాడే పలువురు కొత్త వ్యాపారులు ప్రారంభిస్తారు. జిల్లాలోని నెల్లూరు, నెల్లూరురూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలలో గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
భగ్గుమన్న పూజాసామగ్రి, ప్రతిమలు
వినాయక ప్రతిమల ధరలు రూ.10వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పలికాయి. బుల్లి గణనాథులను రూ.150 నుంచి రూ.2,500 వరకు కొనుగోలు చేశారు. నెల్లూరు నగరంలోని ఏసీ మార్కెట్, ఆత్మకూరు బస్టాండు, సంతపేట, పెద్దబజారు, మూలాపేట, వేదాయపాలెం, భక్తవత్సలనగర్, డైకస్‌రోడ్డు, వెంకటేశ్వరపురం, కొత్తూరు తదితర ప్రాంతాల్లో వినాయక ప్రతిమలు, గొడుగులు, పందిళ్లు, పండ్లు, పూలు విక్రయించారు. పత్రి సామగ్రి దాదాపు రూ.3,00 కాగా, అరటి పిలకలు రూ.30 నుంచి రూ.50 పలికాయి. నైవేద్యానికి నిత్యావసర సరుకులు, కొబ్బరికాయలు, పండ్లు కలిపి ఓ కుటుంబానికి కనీసం రూ.1,500 నుంచి రూ.2వేలు ఖర్చు అయింది. ధరలు పెరిగినప్పటికినీ ప్రజలు ఉత్సాహంగా కొనుగోలు చేశారు.
విద్యుత్ వెలుగుల్లో నగరం
చవితి వేడుకల సందర్భంగా నెల్లూరు నగరం విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడింది. నగరవీధుల్లో తీన్‌మార్ మేళాలతో మండపాలకు తాత్కాలిక గణపతులను వాహనాల్లో తరలించారు. నగరంలోని 54 డివిజన్‌ల్లో చిన్నా పెద్దా కలిపి దాదాపు 300కుపైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు. సింగపేట, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో తయారైన గణపతి ప్రతిమలను ఇక్కడికి తీసుకువచ్చారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
జిల్లాలో ప్రజలంతా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, సుఖశాంతులతో సామరస్యంగా జీవించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, రూరల్ తెలుగుదేశం ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
మట్టి గణపతులను పూజించండి: కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు నగర ప్రజలంతా మట్టి గణపతులనే పూజించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. ఆదివారం రాత్రి సీఎంఆర్, చందనా బ్రదర్స్, ఏబీఎన్-- ఆంధ్రజ్యోతి సంయుక్తంగా నిర్వహించిన మట్టి గణపతుల పంపిణీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. 15 ఏళ్లుగా మట్టి గణపతులను పంపిణీ చేస్నున్న సీఎంఆర్ చందనా బ్రదర్స్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను అభినందించారు. సీఎంఆర్, చందనా బ్రదర్స్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏబీఎన్ సహకారంతో ప్రతీఏటా 10వేల మట్టి గణపతులను అందజేస్తున్నామని తెలిపారు. రాజీయాడ్స్ పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణంపై అవగాహన పెంచామన్నారు. ప్రతి ఏటా ఏకో గణపతులను షాపింగ్‌మాల్‌లో ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది గరికతో చేసిన వినాయకుడిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, ఏబీఎన్ బ్యూరో మహేష్, ఏడీవీటీ మేనేజర్ అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.
====================