నెల్లూరు రైల్వేస్టేషన్‌లో బాంబు ?

ABN , First Publish Date - 2023-09-04T23:58:29+05:30 IST

నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టారంటూ సోమవారం సాయంత్రం ఫోన్‌ రావడంతో కలకలం రేగింది.

నెల్లూరు రైల్వేస్టేషన్‌లో బాంబు ?
బాంబు కోసం తనిఖీ చేస్తున్న పోలీసులు

ఆకతాయి నుంచి ఫోన్‌

అణువణువునా విస్తృత తనిఖీలు

ఉత్తుత్తదేనని నిర్ధారణ

నెల్లూరు(క్రైం),సెప్టెంబరు 4: నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టారంటూ సోమవారం సాయంత్రం ఫోన్‌ రావడంతో కలకలం రేగింది. దీంతో సంతపేట, రైల్వే పోలీసులు, బాంబు స్వ్కాడ్‌తోపాటు పదులు సంఖ్యల్లో ఇతర అధికారులు రైల్వేస్టేషన్‌లో బాంబు కోసం విస్తృతంగా గాలించారు. చివరకు ఉత్తుత్తదేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి 112 నెంబరుకు ఫోన్‌ చేసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లోని ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై బాంబు ఉందని, త్వరలోనే పేలుతుందని చెప్పాడు. దీంతో రైల్వేతోపాటు సంతపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్‌కాల్‌ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు బాంబు, డాగ్‌స్క్వాడ్‌లకు సమాచారం అందించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ పీ మల్లికార్జునరావు పర్యవేక్షణలో రైల్వే సీఐ శ్రీనివాసచారి, ఎస్‌ఐ హరిచందన, సంతపేట ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణ్‌రాజు తమ సిబ్బందితో హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌ నుంచి దూరంగా పంపించేశారు. బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు రైల్వేస్టేషన్‌లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. పార్శిల్‌ కేంద్రంతోపాటు ప్రయాణికుల బ్యాగ్‌లను సైతం తనిఖీ చేశారు. అయితే ఎక్కడా బాంబు లేదని తేలడంతో పోలీసులతోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్‌ చేసిన ఆకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా అతడి ఫోన్‌ స్విచ్ఛాప్‌లో ఉంది.

==============

Updated Date - 2023-09-04T23:58:29+05:30 IST