నగర పంచాయతీ వద్దు.. గ్రామ పంచాయతీలే ముద్దు!

ABN , First Publish Date - 2023-07-21T00:40:07+05:30 IST

అల్లూరు, నార్తుమోపూరు, సింగపేట గ్రామాలు కలిపి నగర పంచాయతీ పరిపాలన తమకొద్దని, తమ గ్రామాలను గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని ప్రజలు ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నగర పంచాయతీ వద్దు.. గ్రామ పంచాయతీలే ముద్దు!
అల్లూరులో వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల వాగ్వాదం

అల్లూరు, జూలై 20 : అల్లూరు, నార్తుమోపూరు, సింగపేట గ్రామాలు కలిపి నగర పంచాయతీ పరిపాలన తమకొద్దని, తమ గ్రామాలను గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని ప్రజలు ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మూడు గ్రామాలను కలుపుతూ గతంలో నగర పంచాయతీగా మార్పు చేస్తూ ఇచ్చిన గవర్నర్‌ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నార్తుమోపూరు గ్రామ నాయకుడు నెల్లూరు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా నగర పంచాయతీ పరిపాలన కేవలం అధికారులకే పరిమితమైంది. దీంతో తమ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలు అందుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉన్నతాధికారుల దిశానిర్దేశాల మేరకు కావలి డీఎల్‌పీవో కె.రాధా మాధవీలత ఆధ్వర్యంలో నగర పంచాయతీపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో పాల్గొన్న ప్రజలు ఎలాంటి కర్మాగారాలు లేని, వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న ఈ మూడు గ్రామాల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఉన్నారని, వీరికి ఉపాధి హామీ పనులు చేజారిపోవడంతోపాటు ఏడాదికి రెండు దఫాలు ఇంటి పన్నులు, వ్యాపార సంబంధిత పన్నులంటూ అనేక రకాలుగా ఆర్థిక భారం పెరుగుతుందని తదితర కారణాల దృష్ట్యా తమకు గ్రామ పంచాయతీ పాలనే కావాలని ముక్తకంఠంతో ఏకాభిప్రాయాన్ని వినిపించారు.

రసాభాసగా అల్లూరు సభ

నార్తుమోపూరు, సింగపేటలలో గ్రామసభలు సజావుగా జరగ్గా అల్లూరులో మాత్రం రసాభాసగా మారింది. ఇక్కడ వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాభిప్రాయం సేకరించకుండానే ఇష్టారీతిగా నగర పంచాయతీగా మార్పుకు దొంగ తీర్మానాలతో చర్యలు తీసుకున్నారని అప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అదేవిధంగా నగర పంచాయతీగా మారితే గద్దెనెక్కి తమ అధికారాన్ని చలాయించవచ్చని భావించిన వైసీపీ నాయకులు ఈరోజు అభిప్రాయ సేకరణకు పూనుకున్నారని విమర్శించారు. దీనికి బదులుగా వైసీపీ నాయకులు మాట్లాడటంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. అందరి అభిప్రాయాలను సేకరించిన డీఎల్‌పీవో మాట్లాడుతూ మూడు గ్రామాల్లో ప్రజలు తమకు నగర పంచాయతీ వద్దంటూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆ మేరకు నివేదికను ఉన్నతాఽధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, కమిషనర్‌ ఫణికుమార్‌, కార్యదర్శి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

=======================

Updated Date - 2023-07-21T00:40:07+05:30 IST