మధురానుభూతుల ముందస్తు పెళ్లి వేడుకలు !
ABN , First Publish Date - 2023-09-24T00:01:54+05:30 IST
ఒకప్పుడు పెళ్లి వేడుకలకు సంబంధించి ఫొటోలు, వీడియోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే జంటలు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకుంటున్నారు.

వివాహానికి ముందే ఫొటోషూట్‌లు
ఔట్‌డోర్‌లోనూ షూటింగ్‌లు
రిస్టార్ట్స్, ఫాంహౌస్‌ల్లో ఆతిథ్యం
ఆసక్తి చూపుతున్న యువత
ఖర్చుకు వెనుకాడని నిర్వాహకులు
ఆదివారం ప్రత్యేకం
ఒకప్పుడు పెళ్లి వేడుకలకు సంబంధించి ఫొటోలు, వీడియోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే జంటలు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకుంటున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చి నిశ్చితార్ధం జరిగిందంటే చాలు.... ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లకు సిద్ధమవుతున్నారు. ఫొటో, వీడియోగ్రాఫర్లను తీసుకుని తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి అందమైన కాస్ట్యూమ్స్‌తో నచ్చేలా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. వీటికి సినిమా పాటలు, జానపద గేయాలను కూడా జతచేస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. అందమైన ప్రదేశాలతోపాటు రిసార్ట్స్, ఆలయాలు, పార్కులు, ఫాంహౌస్‌లు, లేక్‌వ్యూలు.. ఇలా ఎన్నో ప్రదేశాలు ఫొటోషూట్‌ల కోసం ఔట్‌డోర్ లొకేషన్లుగా మారుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరులు తమ మధురానుభూతలను జీవితాంతం గుర్తుంచుకునేలా తీయించుకుంటున్న ఫొటోషూట్‌లపై ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
- నెల్లూరు (విద్య)
నేటి ఆధునిక యుగంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ల ట్రెండ్ అత్యున్నత స్ధాయికి చేరింది. కేవలం మెట్రోపాలిటిన్ సిటీలు, మహానగరాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరించింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే వారు తమ పెళ్లికి సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లే... ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లపై కూడా తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ దీనికే ప్రాధాన్యతనిస్తున్నారు. వారికి నచ్చిన లొకేషన్లలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల ఈ సంస్కృతి చాలా ఎక్కువైంది. జిల్లాలో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు, టూరిజం స్పాట్‌లు, బీచ్‌లు అందుబాటులో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నిరాటకంగా సాగుతున్నాయి. మరికొందరైతే ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ షూటింగ్‌లు చేసుకుంటున్నారు.
వస్త్రాలపై ప్రత్యేక శ్రద్ధ
ప్రీ వెడ్డింగ్ షూట్‌లో వస్తాలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. షూట్‌లలో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఎలాంటి మేకప్ వేసుకోవాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డిజైనర్‌లు కూడా ప్రత్యేకంగా చీర, సల్వార్‌కుర్తా, అనార్కలీ, ట్విన్నింగ్, గౌన్స్, జీన్స్... ఇలా ఎన్నో రకాల మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నారు.
ఎంతైనా పర్లేదు..
ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లకు లక్షలు వెచ్చించి మరీ సినిమాల తరహాలో ప్రొమోలు తీయించుకుంటున్నారు.అనంతరం వాటిని వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూట్ అలాగే పెళ్లితంతు అందరికీ కనిపించేలా పెద్దపెద్ద స్ర్కీన్‌లను అమర్చుతున్నారు. సినిమా షూటింగ్‌లకు వినియోగించే క్రేన్ కెమరాలు, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఫంక్షన్ హాలులో ఎల్‌ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వధూవరులతోపాటు తల్లిదండ్రులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. ఎంతైనా పర్లేదు... షూట్ మాత్రం బాగా రావాలంటూ వెడ్డింగ్ ప్లానర్స్‌కు చెబుతుండడం విశేషం. వేలాది రూపాయలతో ప్రారంభమై లక్షలతో ముగుస్తున్నా ఈ ఖర్చును లెక్క చేయకుండా తమకు నచ్చిన ప్రదేశాల్లో షూటింగ్‌లు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇందుకోసం కొందరు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు కార్లతో పాటు రైళ్లు, విమానాల్లోనూ ప్రయాణించి తమ ఫోటోషూట్‌లను కొనసాగిస్తున్నారు.
ఫొటో, వీడియోగ్రాఫర్లకు డిమాండ్
ఫొటోషూట్‌ల క్రేజ్ పెరగడంతో ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లలో వీరంతా కూడా బాగా బిజీ అయిపోతున్నారు. గతంలో వీరికి పెళ్లి సమయంలోనే ఫొటోలు, వీడియోలు తీసేపని మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, పెళ్లి సమయంలోనూ, పెళ్లి తరువాత కూడా ఫొటోషూట్ తీయిస్తుండడంతో వీరికి డిమాండ్‌తోపాటు పని కూడా పెరిగిపోయింది. వధూవరులతోపాటు ఇతర ప్రాంతాలకు సైతం రోజుల తరబడి వెళ్లాల్సి వస్తుండడంతో వీరి రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉందని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు..
ప్రీ వెడ్డింగ్ షూట్‌లతో బిజీ...
ప్రస్తుత యువత ప్రీ వెడ్డింగ్ షూట్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో అందమైన లొకేషన్లు ఎంచుకుని షూట్ చేస్తున్నాం. ఒప్పందం చేసుకున్న ప్రకారం జిల్లాలోని ప్రకృతి అందాల ప్రదేశంలోనూ లేదా ఇతర జిల్లాల్లోని ప్రాంతాల్లోనూ అందమైన ఫొటో, వీడియోలను తీస్తున్నాం. పెళ్లి సమయంలో మరుపురాని జ్ఞాపకంగా ఈ షూట్ నిలిచిపోతుంది.
- పసుపులేటి రవిచంద్ర, ఫొటోగ్రాఫర్
వీడియోగ్రఫీ ఎంతో కీలకం...
గతంలో పెళ్లి జరిగేటప్పుడు మాత్రమే వీడియో తీసేవాళ్లం.ప్రస్తుతం నడుస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ కారణంగా టూరిజం స్పాట్స్, ఇతర ప్రకృతి అందాల ప్రాంతాలను ఎంచుకుని వీడియోలు తీస్తున్నాం. నూతన జంటకు అందమైన వీడియోలు అందించడమే లక్ష్యంగా మేము అత్యాధునిక కెమెరాలను వినియోగిస్తున్నాం. అవసరమైన చోట డ్రోన్‌లను సైతం వాడుతున్నాం.
- కుమార్, వీడియోగ్రాఫర్
================