Share News

తహసీల్దారు కార్యాలయాన్ని వేధిస్తున్న సిబ్బంది కొరత!

ABN , First Publish Date - 2023-11-24T23:32:39+05:30 IST

లింగసముద్రం తహసీల్దారు కార్యాలయానికి సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ ఇన్‌చార్జి తహసీల్దారు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లే దిక్కయ్యారు.

తహసీల్దారు కార్యాలయాన్ని వేధిస్తున్న సిబ్బంది కొరత!
లింగసముద్రం తహసీల్దారు కార్యాలయం

సకాలంలో పనులు జరగక ఇక్కట్లు

లింగసముద్రం, నవంబరు 24 : లింగసముద్రం తహసీల్దారు కార్యాలయానికి సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ ఇన్‌చార్జి తహసీల్దారు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లే దిక్కయ్యారు. దీంతో సకాలంలో పనులు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో చాలాకాలం నుంచి అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. రెండు నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దారు షేక్‌ మీరావళి కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం డీఏవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకుండా కార్యాలయంలో రీ సర్వే డీటీగా పని చేస్తున్న టీ ప్రసాద్‌కు ఇన్‌చార్జి తహసీల్దారుగా బాధ్యతలు అప్పగించారు. అలాగే కార్యాలయంలో పని చేస్తున్న డీటీ లక్ష్మీప్రసన్న ఏడాది క్రితం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు సుమారు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. మండల సర్వేయర్‌ పోస్టు కూడా 3 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఇక మండల ఆర్‌ఐ ఫణీంద్ర కుటుంబ కారణాలతో 15 రోజులు సెలవు పెట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని 13 సచివాలయాల్లోనూ వీఆర్వోలు, సర్వేయర్ల కొరత వెంటాడుతోంది. దీంతో సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయంలో సకాలంలో పనులు జరగడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సిబ్బంది కొరతతో రీ సర్వే కూడా వేగంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు స్పందించి అధికారులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-11-24T23:32:41+05:30 IST