లెక్కలతో చిక్కులు

ABN , First Publish Date - 2023-06-02T23:54:52+05:30 IST

కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పంచాయతీరాజ్‌(పీఆర్‌) ఇంజనీర్ల పరిస్థితి. రూ.కోట్లతో పనులు చేయిస్తున్న ఆ శాఖ ఇంజనీర్లు ఇప్పుడు సిమెంటు లెక్కల్లో ఇరుక్కుపోయారు. నేరుగా అధికారుల పేరుతో సిమెంటు సరఫరా అయితే ఇబ్బందులు వస్తాయని మొదట్లోనే వారు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

లెక్కలతో చిక్కులు
వరికుంటపాడు మండల పెద్దిరెడ్డిపల్లిలో అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయం

పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల ఆందోళన

కాంట్రాక్టర్లకు కాకుండా అధికారుల పేరుతో సరఫరా

విధానం మార్చాలన్నా పట్టించుకోని ప్రభుత్వం

పలు సమస్యలతో పూర్తికాని నిర్మాణాలు

కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పంచాయతీరాజ్‌(పీఆర్‌) ఇంజనీర్ల పరిస్థితి. రూ.కోట్లతో పనులు చేయిస్తున్న ఆ శాఖ ఇంజనీర్లు ఇప్పుడు సిమెంటు లెక్కల్లో ఇరుక్కుపోయారు. నేరుగా అధికారుల పేరుతో సిమెంటు సరఫరా అయితే ఇబ్బందులు వస్తాయని మొదట్లోనే వారు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇండెంట్‌ పెట్టడమే తడువుగా సిమెంటును సరఫరా చేసింది. ఆ సిమెంటును నిల్వ చేసుకునేందుకు వసతి లేక కాంట్రాక్టర్లకే ఇంజినీర్లు అప్పగించారు. అయితే వివిధ కారణాలతో నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు, పలుచోట్ల వైసీపీ నేతలు ఆ సిమెంటును ఇతర పనులకు ఉపయోగించారు. దీంతో ఇప్పుడు ఆ సిమెంటుకు లెక్కలు చూపాలని ప్రభుత్వం కోరగా, చాలా చోట్ల పక్కదారి పట్టినట్లు తేలింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

నెల్లూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు 659 సచివాలయాలు, 538 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 656 రైతు భరోసా కేంద్రాలు, 272 డిజిటల్‌ లైబ్రరీలు, 197 పాలశీతలీకరణ కేంద్రాలు, 73 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణాలను పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టింది. వీటికి తోడు వివిధ కేంద్ర పథకాల ద్వారా మరికొన్ని పనులను మంజూరు చేయగా, వాటిని కూడా పీఆర్‌ ఎగ్జిక్యూట్‌ చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి శాఖలోనూ సిమెంటును కొనుగోలు చేసే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లకే ఇచ్చేవారు. ఆ మేరకు బిల్లును ఎస్టిమేషన్‌లో పొందుపరిచేవారు. కానీ పీఆర్‌లో దాదాపు రెండేళ్లపాటు సిమెంటు సరఫరా బాధ్యతలను ఇంజనీర్లకు అప్పగించారు. పనులు మంజూరు చేసిన వెంటనే ప్రారంభించేలా ఇంజనీర్ల చేత సిమెంటు ఇండెంట్‌ పెట్టించేవారు. వెంటనే సిమెంటు సరఫరా జరిగేది. ఆ బిల్లును ప్రభుత్వం సిమెంటు కంపెనీలకు చెల్లించేది. ఈ సిమెంటును ఇంజనీర్లే దించుకోవాలి. వారి ఆధీనంలోనే నిల్వ చేసుకోవాలి. కాంట్రాక్టర్‌ చేస్తున్న పనుల ఆధారంగా వారికి సిమెంటును వారే సరఫరా చేయాలి. అంటే ఓ రకంగా ఆ సిమెంటుకు ఇంజనీర్లు కాపలాదారులన్నమాట. కాంట్రాక్టర్‌కు నేరుగా సిమెంటు సరఫరా చేస్తే వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో నిల్వ చేసుకునేవారు. పనులు ఆలస్యం చేసినా ఆ సిమెంటుకు వారే బాధ్యత వహించేవారు. కానీ కొత్త విధానంలో నేరుగా ఇంజనీర్ల పేరుతో సిమెంటు సరఫరా చేసిన ప్రభుత్వం దాన్ని నిల్వ చేసుకునేందుకు మాత్రం ఎలాంటి వసతి కల్పించలేదు. అందులోనూ అర్ధరాత్రి సిమెంటు లారీలు డెలివరీ ఇస్తుండడం, ఆ సమయంలో కూలీలను మాట్లాడుకోవాల్సి రావడం, మరోవైపు వర్షాలు కురుస్తుండడం తదితర క్షేత్రస్థాయి సమస్యలను భరించలేని పీఆర్‌ ఇంజనీర్లు సిమెంటును నేరుగా కాంట్రాక్టర్లకే పంపేవారు. వారే వాటిని దించుకొని నిల్వ చేసుకునేవారు.

ఫ బిల్లులివ్వకపోవడమే సమస్య...

మొదట్లో వేగంగా పనులు జరిగాయి. కాంట్రాక్టర్లు కూడా హుషారుగా పనులు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఇంజనీర్లు కూడా నిర్మాణానికి అవసరమైన మొత్తం సిమెంటును ఒకేసారి ఇండెంట్‌ పెట్టడం చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. మంజూరైన పనుల్లో కనీసం మూడో వంతు కూడా పూర్తి చేయలేదంటేనే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో... అదిగో... బిల్లులు ఇచ్చేస్తాం... అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ రావడంతో పీఆర్‌ ఇంజనీర్లు కూడా నమ్మారు. బిల్లులు రాగానే పనులు మొదలుపెడతామని కాంట్రాక్టర్లు చెబుతుండడంతో ఇంజనీర్లు కూడా సిమెంటును పట్టించుకోలేదు. అయితే నెలలు, ఏళ్లు గడిచినా బిల్లులు రాకపోవడం, నిల్వ ఉన్న సిమెంటు గడ్డ కడుతుండడంతో పలువురు కాంట్రాక్టర్లు ఆ సిమెంటును వేరే పనులకు ఉపయోగించారు. కొన్ని చోట్ల ఇతరులకు కూడా విక్రయించినట్లు కూడా తెలుస్తోంది.

లెక్కలు అడగడంతో ఆందోళన

కాంట్రాక్టర్లలో చాలావరకు గ్రామ, మండల స్థాయి వైసీపీ నేతలే కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ప్రభుత్వం గతంలో సరఫరా చేసిన సిమెంటుకు లెక్కలు అడగడంతో ఇంజనీర్లలో ఆందోళన మొదలైంది. ఏ పనికి ఎంత సిమెంటు సరఫరా జరిగింది? ఏ మేరకు నిర్మాణం చేశారు? మిగిలిన సిమెంటు ఎక్కడుంది? వంటి వివరాలు కోరింది. ఈ క్రమంలో ఇంజనీర్లంతా కాంట్రాక్టర్ల వద్దకు వెళ్లి మిగులు సిమెంటును అందజేయాలని కోరగా, వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ‘మేము ఆ భవనానికి చాలా ఖర్చు చేశాం. ముందు మా బిల్లు ఇవ్వండి. మిగులు సిమెంటును మరో పనికి వాడేశాం. మాకు బిల్లు ఇస్తే మళ్లీ పనులు మొదలుపెడతాం. మా దగ్గర ఉండాల్సిన సిమెంటునే మేము ఆ పనులకు ఉపయోగిస్తాం’ అంటూ సమాధానమిస్తున్నారు. దీంతో పీఆర్‌ ఇంజనీర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సిమెంటు లెక్కలు తేలకపోవడంతో పక్కదారి పట్టినట్లు గుర్తించిన ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా జిల్లాలోనూ విజిలెన్స్‌ అధికారులు మిగులు సిమెంటు వివరాలను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీంతో పీఆర్‌ ఇంజనీర్లలో ఆందోళన మొదలైంది. కాగా ఈ వ్యవహారంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వద్దని మొదట్లోనే చెప్పినా ప్రభుత్వం ఎవరి కోసమో తమకు సిమెంటు సరఫరా బాధ్యతలను అప్పగించిందని, ఇప్పుడు బిల్లులు ఇవ్వని కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే ఆ భారాన్ని తమపై మోపాలని చూస్తోందని వాపోయారు. గతంలో పీఆర్‌ ఇంజనీర్లు ఈ విధానంపై ఆందోళన కూడా చేశారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇచ్చేస్తే ఈ సమస్య రాదు కదా.. ? అని పలువురు వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు.

==========

Updated Date - 2023-06-02T23:54:52+05:30 IST