లంచం సొమ్ము.. సేకరణకో ఏజెంట్‌!

ABN , First Publish Date - 2023-07-18T00:42:20+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలోని అవినీతి అధికారులు అక్రమ సంపాదనకు రూటు మార్చారు. కాంట్రాక్టర్ల వద్ద నేరుగా డబ్బులు తీసుకునేందుకు ఏసీబీ నిఘా ఉండటంతో ఓ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

లంచం సొమ్ము..  సేకరణకో ఏజెంట్‌!

ఏసీబీ నిఘాతో రూట్‌ మార్చిన యంత్రాంగం

అదేబాటలో రెవెన్యూ విభాగం

నెల్లూరు నగర పాలక సంస్థలోని అవినీతి అధికారులు అక్రమ సంపాదనకు రూటు మార్చారు. కాంట్రాక్టర్ల వద్ద నేరుగా డబ్బులు తీసుకునేందుకు ఏసీబీ నిఘా ఉండటంతో ఓ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సొంత శాఖకు చెంది, నమ్మన బంటు కావడంతో అవినీతి సొమ్మంతా అతని ద్వారానే గమ్యం చేర్చుతున్నారు. తొలుత ఇంజనీరింగ్‌ అధికారులు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగ, అదేబాటలో కొందరు రెవెన్యూ విభాగం అధికారులు నడుస్తున్నారు.

నెల్లూరు(సిటీ), జూలై 17 : ఇటీవల నెల్లూరు నగరంలో రోడ్లు, కల్వర్టులు, భవన నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు అదేవేగంగా మంజూరవుతున్నాయి. దీంతో రూ.కోట్లలో జరుగుతున్న ఈ పనులకు రూ. లక్షల్లో అవినీతి సొమ్ము పర్సంటేజీల రూపేనా ఇంజనీరింగ్‌ విభాగానికి చేరుతోంది. ఇందులో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరు తమ తమ పర్సంటేజీలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇందుకు సిద్ధమైన కాంట్రాక్టర్లు అదేవేగంతో లంచాలను అందచేసేందుకు సిద్ధమయ్యారు. అవినీతికి అడ్రస్సుగా మారిన కార్పోరేషన్‌పై ఏసీబీ నిఘా ఉండటంతో అవినీతి సొమ్మును సదరు వ్యక్తుల నుంచి యథేచ్ఛగా తీసుకునేందుకు జంకుతున్న అధికారులు ఏకంగా ఓ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తమకు రావాల్సిన పర్సెంటేజీలను సదరు ఏజెంట్‌ వద్ద అందచేయాలని ఫోన్‌ నెంబరు సహా సూచిస్తున్నారు. ఆ తరువాత అతని ద్వారా ఆ సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా గమ్యస్థానాలకు చేర్చేస్తున్నారు. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు ఇదే తరహా వ్యవహారాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. పన్నులు వేసేందుకు, పేర్లు మార్చేందుకు, మొండిబకాయిదారులను వేధించకుండా చూసీచూడనట్లు నడుచుకునేందుకు అందే అవినీతి సొమ్మును సదరు ఏజెంట్‌ వద్దకే పంపుతున్నట్లు తెలుస్తోంది.

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగే ఏజెంట్‌

అవినీతి అధికారులకు సొమ్ము అందచేసే వ్యక్తి కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగే కావడం గమనార్హం. జాబ్‌చార్టును ఏనాడు అనుసరించని ఆయన అధికారులకు వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అవినీతి అందికారులందరికీ ఏజెంట్‌గా మారి వారికి అందాల్సిన అవినీతి సొమ్మును సదరు వ్యక్తుల ద్వారా తీసుకుని అధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు ఏ పని చెప్పని విభాగాధిపతులు కేవలం ఇదే పనికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

========

Updated Date - 2023-07-18T00:42:20+05:30 IST