కూరగాయలకు డబ్బుల్లేవ్‌ !

ABN , First Publish Date - 2023-09-13T22:08:09+05:30 IST

నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు భారంగా మారింది. ఈ కేంద్రాలకు కూరగాయల బిల్లులు నెలల తరబడి రావడంలేదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర వేతనాలతో ఇంటి, నెలవారీ ఖర్చులకే అవస్థలు పడుతున్న తమపై

 కూరగాయలకు డబ్బుల్లేవ్‌ !
13యుడిజిఆర్‌1: ఉదయగిరి అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు

ఐదు నెలలుగా అందని బిల్లులు

పౌష్టికాహారంపై ప్రభావం

అంగన్‌వాడీలపై ఆర్థికభారం

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 13: నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు భారంగా మారింది. ఈ కేంద్రాలకు కూరగాయల బిల్లులు నెలల తరబడి రావడంలేదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర వేతనాలతో ఇంటి, నెలవారీ ఖర్చులకే అవస్థలు పడుతున్న తమపై కూరగాయల బిల్లుల భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయలకు నిత్యం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.

ఐదునెలలుగా అందని బిల్లులు

జిల్లాలో 14 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిఽధిలో 2,934 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు సుమారు 1.38 లక్షల మంది ఉన్నారు. గతనెల నుంచి బాలింతలు, గర్భిణీలకు టేక్‌ హోం రేషన్‌ కింద ఇంటి వద్దకే పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు మాత్రం కూరగాయలు కొనుగోలు చేసి కేంద్రాల్లోనే పదార్థాలను వండాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కార్యకర్తలకు కూరగాయల బిల్లులు అందించాల్సి ఉంది. కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారే తప్ప బిల్లుల మంజూరుపై చొరవ చూపడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం పౌష్టికాహారంపై పడుతోంది.

అప్పులు చేయాల్సి వస్తోంది...

ఐదారు నెలలకోసారి కూరగాయల బిల్లులు చెల్లిస్తుండడంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్యకర్తలు వాపోతున్నారు. వేతనాల్లో అయినా సర్దుబాటు చేసుకుందామంటే అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి కూరగాయలు, పప్పుదినుసులు, గ్యాస్‌ కోసం రూ.2 ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన 20 మందికి రోజుకు రూ.40ల చొప్పున నెలకు రూ.1,200లు ఖర్చవుతుంది. ఇలా ఒక్కో కేంద్రానికి చిన్నారుల సంఖ్యను బట్టి కూరగాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కార్యకర్తలు, ఆయాలు కోరుతున్నారు.

త్వరలో మంజూరు చేస్తాం..

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్‌ కూడా వచ్చింది. త్వరలో కార్యకర్తల ఖాతాల్లో బిల్లులు జమ చేస్తాం.

- హేనాసుజన, ఐసీడీఎస్‌ పీడీ

Updated Date - 2023-09-13T22:08:09+05:30 IST