కేజీబీవీల్లో కానరాని వసతులు

ABN , First Publish Date - 2023-06-02T23:57:06+05:30 IST

అక్కడ బోధనా సిబ్బందిని నియమించరు....బోధనేతర సిబ్బంది ఊసే ఎత్తరు... ఖాళీ లను భర్తీ చేయరు... ఫలితంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేబీజీవీలు)అరకొర బోధనతోనే కొనసాగుతు న్నాయి. జిల్లాలోని మొత్తం పది కేజీబీవీల్లో బాలికల జూనియర్‌ కళాశాలలు మొక్కుబడిగా కొనసాగుతు న్నాయి.

కేజీబీవీల్లో కానరాని వసతులు
కలిగిరిలోని కేబీబీవీ

బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో ఇబ్బందులు

కుంటుపడుతున్న బాలికా విద్య

మొక్కుబడిగా ఇంటర్‌ తరగతుల నిర్వహణ

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినా గోప్యం

నెల్లూరు (విద్య) జూన్‌ 2: అక్కడ బోధనా సిబ్బందిని నియమించరు....బోధనేతర సిబ్బంది ఊసే ఎత్తరు... ఖాళీ లను భర్తీ చేయరు... ఫలితంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేబీజీవీలు)అరకొర బోధనతోనే కొనసాగుతు న్నాయి. జిల్లాలోని మొత్తం పది కేజీబీవీల్లో బాలికల జూనియర్‌ కళాశాలలు మొక్కుబడిగా కొనసాగుతు న్నాయి. వీటిల్లో ఫలితాలు కూడా నామమాత్రంగానే రావడంతో బాలికల సమస్యలు వర్ణణాతీతంగా ఉన్నాయి. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైనా జిల్లాలో మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలో రహస్యంగానే నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది..

వసతులు లేకున్నా అప్‌గ్రేడ్‌

వసతులు లేకున్నా ప్రభుత్వం గత విద్యాసంవత్సరం కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ జూనియర్‌ కళాశాలలుగా మార్చింది. గతంలో అప్‌గ్రేడ్‌ చేసిన వాటిలోనే సిబ్బంది కొరత, అరకొర వసతులతో ఇబ్బందులు పడుతుంటే ఈ కళాశాలలను ఏం చేస్తారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవనాలు లేవు, ప్రయోగశాలలు లేవు, ఇతర వసతులు లేవు, పైగా టీచింగ్‌ సిబ్బంది నియామకాలు చేపట్టకుండా ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు జరపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో బాలికా విద్య భరోసాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేజీబీవీ జూనియర్‌ కళాశాలలో సీట్లు భర్తీ చేస్తున్నా, పాఠాలు చెప్పే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లను మాత్రం పూర్తిస్ధాయిలో భర్తీ చేయడం లేదు. మొత్తం 123 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, గత ఏడాది నుంచి 96 మంది పనిచేస్తున్నారని, మరో 27 పోస్టులు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే వాస్తవానికి ఈ లెక్కలు తప్పుగానే ఉన్నాయని, వీటిలో పదిమంది ప్రిన్సిపాల్స్‌, పదిమంది పీఈటీలు పోగా మిగిలిన బోధనా సిబ్బంది పోస్టులు అధికంగానే ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు గతంలో భారీగానే దరఖాస్తులు వచ్చినా, అవినీతి అరోపణల నేపఽథ్యంలో భర్తీని నిలిపివేశారు. తాత్కాలికంగా అతిఽథి అధ్యాపకులను నియమించి, గత విద్యాసంవత్సరం చివరిలో వీరందరిని తొలగించారు.

ఖాళీల భర్తీ ఎప్పుడో... ?

కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు, పీఈటీలతో పాటు పీజీటీ తెలుగు, ఇంగ్లీష్‌, గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, అకౌంట్‌ అండ్‌ టాక్సేషన్‌, జీఎఫ్‌సీ, డీఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్‌ఈ, పీఎస్‌టీటీ తదితర పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. టీచర్లు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో బోధన పూర్తిగా కుంటుపడింది. ప్రస్తుతం పనిచేస్తున్న పీజీటీల్లో అభద్రతాభావం నెలకొని ఉంది. పార్ట్‌టైం, ఫుల్‌టైం అంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వసతులు, సిబ్బంది నియామకాలు చేపట్టి అప్‌గ్రేడ్‌ చేయాల్సిన కేజీబీవీలు ప్రభుత్వం నిర్ణయంతో మరింత కుంటుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రాజకీయ జోక్యం...

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్లు(పీజీటీ) ఖాళీల భర్తీకి అధికార వైసీపీ పార్టీ నేతలే అడ్డుగా నిలిచారు. వేలాదిమంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు. గతంలో కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సీనియర్‌ హెచ్‌ఎంలతో కూడా స్ర్కూట్నీ చేయించారు. ఇంతలో అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి పైరవీలు ప్రారంభించారు. ఈ పోస్టుల్లో తాము చెప్పిన వాళ్లకే పెద్దపీట వేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఉన్న ఫళంగా ఈ పోస్టుల భర్తీని నిలిపివేశారు.

ఖాళీల ప్రకటన ఏది ?

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే అర్హులైన అభ్యర్ధినులు గత నెల 30 నుంచి ఈనెల 5వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌పీడీ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా జిల్లాలో మాత్రం నేటికీ ఈ ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రిన్సిపాళ్లు 92, పీజీటీలు 846, సీఆర్‌టీలు 374, పీఈటీలు 46 కలిపి మొత్తం 1358 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించగా జిల్లాలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో మాత్రం అధికారులు, సిబ్బందికి తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని, దరఖాస్తు చేసుకునే వారు ఏ పోస్టు ఖాళీగా ఉందో తెలియకుండా ఎలా అప్లై చేస్తారని అభ్యర్థినులు ప్రశ్నిస్తున్నారు. పైగా జిల్లాల వారీగా, సబ్జెక్ట్‌ల వారీగా, రోస్టర్‌ వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హత వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని చెబు తున్నారన్నారు. దీనిపై ఎస్‌ఎస్‌ఏ అధికారిని సంప్రదించగా ఫోన్‌ కూడా ఎత్తలేదు. పోస్టుల వివరాలను వెల్లడించడం ఆ అధికారికి ఇష్టంలేదని, ఏకపక్ష నిర్ణయాలతో సిబ్బంది సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్యాలయ సిబ్బంది చెప్పడం గమనార్హం.

==============

Updated Date - 2023-06-02T23:57:06+05:30 IST