ఎన్నాళ్లిలా..!?
ABN , First Publish Date - 2023-09-20T23:42:43+05:30 IST
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు పద్నాలుగేళ్ల క్రితం కావలిలో కీలకమైన రైల్‌వోవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కావలి-పెదపవని రోడ్డులో ఆర్వోబీ నిర్మిస్తే పట్ణణంలో చాలావరకు ట్రాఫిక్‌ను నియత్రించవచ్చని భావించారు.
ఒప్పందం జరిగినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్
ఆరునెలలు గడవడంతో నోటీసులు
ఇప్పటికే మూడుసార్లు శంకుస్థాపన
అయినా ఎప్పటికి పూర్తయ్యేనో...!?
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు పద్నాలుగేళ్ల క్రితం కావలిలో కీలకమైన రైల్‌వోవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కావలి-పెదపవని రోడ్డులో ఆర్వోబీ నిర్మిస్తే పట్ణణంలో చాలావరకు ట్రాఫిక్‌ను నియత్రించవచ్చని భావించారు. కానీ ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన జరిగినా, బ్రిడ్జి మాత్రం పూర్తి కాలేదు. గతంలో భూసేకరణ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఒక్క ఆర్వోబీని పూర్తి చేయలేకపోతున్నారు. కొత్త ధరలతో ఆరు నెలల క్రితం టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్లు జరిగినా, కాంట్రాక్టర్ ఇంత వరకు పనులు మొదలుపెట్టలేదు. సదరు కాంట్రాక్టర్‌కు ఈ పనులపై ఆసక్తి లేదని ఆర్‌అండ్‌బీలో చర్చించుకుంటుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో కావలి ఆర్వోబీకు మళ్లీ గ్రహణం పట్టిందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నెల్లూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కావలిలో ఆర్‌వోబీ నిర్మాణానికి 2009లో మొదటిసారి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. రైల్వే శాఖ తన పరిధిలోని బ్రిడ్జి నిర్మాణాన్ని మాత్రం ఎప్పుడో పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా భూసేకరణ సమస్యతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే గత ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి.
2019లో మళ్లీ శంకుస్థాపన
ఈ నేపథ్యంలో 2019 డిసెంబరులో ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మరోమారు ఆర్వోబీకు శిలాఫలకం వేశారు. ఆ వెంటనే కొత్త అంచనాల ప్రకారం టెండర్లు పిలిచారు. ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నాక పనుల నుంచి తప్పుకున్నారు. బిల్లుల సమస్యతో ఈ కాంట్రాక్టర్ తప్పుకున్నట్లు ప్రచారం ఉంది. ఇలా మూడేళ్లు గడిచిపోయాక ఈ ఏడాది మొదట్లో మరోసారి కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచారు. సుమారు రూ.18 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా ఒకే ఒక సంస్థ టెండర్ దాఖలు చేసింది. సాధారణంగా సింగిల్ టెండర్‌ను ఆమోదించకూడదు. కానీ ఆర్‌వోబీ నిర్మాణానికి ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదని సింగిల్ టెండర్‌ను ఆమోదించారు. సదరు కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ జరిగి కూడా దాదాపు ఆరు నెలలు కావస్తోంది. నిబంధనల ప్రకారం 18 నెలల్లో పని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. పనులు మొదలుపెట్టాలంటూ ఆదేశించారు. కానీ ఇంతవరకు ఫలితం కనిపించలేదు. అయితే ఆర్వోబీ పనులపై సదరు కాంట్రాక్టర్‌కు ఆసక్తి లేదని ఆర్‌అండ్‌బీ శాఖలో చెప్పుకుంటున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఈ కాంట్రాక్టర్ పేరుపై టెండర్ వేశారని, కానీ ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధి తాను పని చేయలేనంటూ చేతులేత్తేసిన కారణంగానే పనులు మొదలుకాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివాదాలే ఎక్కువ..
కావలిలో కీలకమైన ఆర్వోబీ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆర్వోబీ సమస్య పరిష్కారం కన్నా దాని చుట్టూ వివాదాలే ఎక్కువగా అలుముకుంటున్నాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన టెండర్లో పెట్టిన నిబంధనలు వివాదాస్పద మయ్యాయి. జిల్లాలో జరుగుతున్న వర్కులన్నింటికీ జిల్లాలో ఆమోదించిన క్వారీల నుంచే మెటీరియల్‌ను సరఫరా చేయాల్సి ఉంది. ఆ మేరకు మాత్రమే ఆ దూరాన్ని టెండర్‌లో నమోదు చేసి అందుకు సరిపడా అంచనాలు రూపొందించాలి. ఇప్పటివరకు అన్నీ వర్కుల్లో అదే జరుగుతుండగా ఆర్‌వోబీ విషయంలో మాత్రం ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ నిబంధనలను అతిక్రమించారు. జిల్లాలో అనుమతులు పొందిన పారిచెర్లపాడు వంటి క్వారీల నుంచి కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి క్వారీ నుంచి మెటల్ తెచ్చుకునేలా అనుమతులిచ్చారు. ఇలా లీడ్(దూరం) పెరగడంతో టెండర్ అంచనాల్లో కూడా సుమారు రూ.2 కోట్ల వరకు పెరిగినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ దూరంలో ఉన్న క్వారీలను కాదని ఎక్కువ దూరంలో ఉన్న క్వారీలను నిబంధనల్లో చేర్చడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అదే కావలిలో ప్రధాన రహదారిని సుమారు రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తుండగా ఈ వర్కుకు కూడా పారిచెర్లపాడు క్వారీ నుంచే లీడ్ ఇవ్వడం గమనార్హం. అయితే అంచనాలు పెరిగినప్పటికీ పనులు మాత్రం జరగకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
త్వరలో పనుల ప్రారంభం
ఈ విషయంపై కావలి ఆర్‌అండ్‌బీ ఈఈ రామకృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా పనులు మొదలు పెట్టకపోవడంతో కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. త్వరగా పనులు మొదలు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
===================