Share News

జొన్నవాడలో వైభవంగా అన్నాభిషేకం

ABN , First Publish Date - 2023-11-27T23:44:33+05:30 IST

కార్తీక సోమవారం సందర్భంగా మండలంలోని జొన్నవాడ ఆలయంలో సోమవారం రాత్రి మల్లికార్జునస్వామికి వైభవంగా అన్నాభిషేకం నిర్వహించారు.

జొన్నవాడలో వైభవంగా అన్నాభిషేకం
జొన్నవాడ ఆలయ ముఖమండపంలో శివుడికి నిర్వహిస్తున్న అన్నాభిషేకం

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 27: కార్తీక సోమవారం సందర్భంగా మండలంలోని జొన్నవాడ ఆలయంలో సోమవారం రాత్రి మల్లికార్జునస్వామికి వైభవంగా అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులంతా వీక్షించేలా ఆలయ ముఖ మండపంలో శివలింగానికి అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం స్వామివారికి పాలభిషేకం, పంచామృత అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి నవావరణ పూజలు నిర్వహించారు. ముందుగా అన్నాభిషేకం ఉభయకర్తలు హైదరాబాదుకు చెందిన తంగెళ్ల సుధాకర్‌, సాయిసత్య, సాయికార్తీక్‌ల గోత్రనామాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కార్తీక దీపారాధనలు, పిండిదీపాలు వెలిగించారు. దీంతో ఆలయం కార్తీకదీపాల శోభ సంతరింతచుకుంది. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో వీ గిరికృష్ణ తదితరులు పర్యవేక్షించారు.

శివాలయాల్లో కార్తీక దీపారాధన

బుచ్చిలోని పెద్దూరు, వవ్వేరు, దామరమడుగు, మినగల్లు, పంచేడు, పెనుబల్లి తదితర గ్రామాల శివాలయాల్లో భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. భక్తలతో ఆలయాలన్ని కిటకిటలాడాయి.

పెంచలకోనకు పోటెత్తిన భక్తులు

రాపూరు (డక్కిలి) నవంబరు 27 : కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా పెంచలకోన పుణ్యక్షేత్ర్నాన భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఉదయం 1001 దీపాలతో పూజలు, అనంతరం కలశాభిషేకం, సాయంత్రం కృత్తికా దీపోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వేణుంబాక జ్యోతమ్మ, గుండ్రు సీతారామయ్య, రాజ్యలక్ష్మి వ్యవహరించారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిషనర్‌ జనార్దనరెడ్డి ఆయన పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు.

================

Updated Date - 2023-11-27T23:44:35+05:30 IST