కుట్టి.. కుట్టి చంపుతున్నాయ్‌!

ABN , First Publish Date - 2023-08-19T23:38:08+05:30 IST

రాత్రే కాదు.. పగటిపూటా దోమలు విజృంభిస్తున్నాయి. రోడ్డుమీద నిలబడుకున్నా.. ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా కుట్టి కుట్టి చంపేస్తున్నాయి.

కుట్టి.. కుట్టి చంపుతున్నాయ్‌!
నెల్లూరు : మురుగు కూపంగా ఉన్న ఇందిరమ్మ గృహ సముదాయం

అలక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యమే

గ్రామాల్లో పరిస్థితి అధ్వానం

ఇప్పటికే ఆసుపత్రులు కిటకిట..

ఫలితాలివ్వని ‘ఫ్రైడే.. డ్రైడే’!

నివారణ, ప్రజా చైతన్యంలో ప్రభుత్వం విఫలం

నేడు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం

రాత్రే కాదు.. పగటిపూటా దోమలు విజృంభిస్తున్నాయి. రోడ్డుమీద నిలబడుకున్నా.. ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఆసుపత్రిపాలు చేస్తుండగా, మరికొంతమందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. మొత్తమ్మీద ప్రాణాంతక మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులు కలగజేసే దోమలకు నిలయంగా జిల్లా మారుతోంది. ఇప్పటికే దోమకాటుతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 4 మలేరియా, 98 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నా వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయినా దోమలు నివారించడంలో, వాటి వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది.

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 19 : దోమ.. చిన్నదయినా మనిషి ప్రాణం తీస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతక వ్యాధులకు గురికావాల్సిందే. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు కలగజేసే దోమలకు నిలయంగా జిల్లా మారుతోంది. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా వైద్యాధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. నెల్లూరు నగరంతోపాటు దుత్తలూరు, సీతరామాపురం, ఉదయగిరి, రాపూరు, తదితర మండలాల్లో డెంగ్యూ చాపకింద నీరులో విస్తరిస్తోంది. రాపూరు, మర్రిపాడు, ఉదయగిరి తదితర మండలాల్లో మలేరియా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. అబ్బే కేసులు తక్కువేనంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.

దోమల్లో వేల రకాలు..

ప్రకృతిపరంగా 3700 రకాల దోమలు ఉండగా ఇందులో ప్రమాదకర వ్యాధులు కలిగించేవి మాత్రం 100 రకాలేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలలో దోమలపై అవగాహన కల్పించేలా ప్రతి ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. ప్రత్యేకించి 1897, ఆగస్టు 20న మలేరియా వ్యాధి ఆడ ఎనాఫలిస్‌ దోమ వల్ల వస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త సర్‌ రోనాల్డ్‌ రాస్ని గుర్తుగా ఈ ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనికి అనుగుణంగా జిల్లావ్యాప్తంగా దోమలపై అవగాహన కార్యక్రమాలు కూడా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

అన్నీ సరే.. నిధులేవీ!?

ప్రాణాంతక దోమల నివారణలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ప్రత్యేకించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో దోమల నివారణ ఒక సవాలుగా మారుతోంది. పంచాయతీలలో నిధులు లేకపోవటంతో పారిశుధ్య చర్యలు చేపట్టలేమని సర్పంచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవటంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోమల నివారణ చేపట్టలేమని చేతులెత్తేస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు గ్రామాలలో మొక్కుబడిగా సాగుతున్నాయి. లార్వా దశలోనే దోమలను నివారించాలని వైద్యాధికారులు చేస్తున్న ప్రచారానికి నిధుల లేమివల్ల సక్రమంగా జరగటం లేదు. వైద్య ఆరోగ్య శాఖకు కూడా అవసరమైన నిధులు విడుదల చేయక పోవటంతో దోమల నివారణకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చి నిల్వ ఉన్న నీటిని పారబోసేలా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఒక నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, ఆత్మకూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలు పటిష్ట చర్యలు తీసుకోక పోవటంతో దోమలు ప్రమాదకరంగా మారుతున్నాయి. పట్టణాలే కాదు.. గ్రామాల్లోనూ పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉండడంతో మురికి కాలువలు, గుంతలు, నీటి నిల్వ కేంద్రాలు దోమల ఉత్పత్తికి నిలయాలుగా మారుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే కాలువల నిర్మాణాలు, పరిశుభ్రత చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడంలేదు.

ప్రజలపై భారం 4.20 కోట్లు

దోమల నివారణలో ప్రజలపై ఆర్థిక భారం తప్పడం లేదు. దోమల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి కుటుంబం రోజుకు రూ.2 ఖర్చు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 7 లక్షల కుటుంబాలు ఉండగా దోమల నివారణకు ప్రతి నెలా రూ.4.20 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రోజుకు రూ.2 వంతున మస్కిటో కాయిల్స్‌కు రూ.10లక్షలు, లిక్విడ్‌ రూపేణా మరో రూ.4 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆగస్టు నుంచి జనవరి వరకు దోమలు ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో ఈ ఆరు నెలల్లో ప్రజలు చేసే ఖర్చు రూ. 25.2 కోట్లు ప్రజలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

చిన్నదయినా పెద్ద ప్రాణం తీస్తుంది

- డాక్టర్‌ కాలేషా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, జీజీహెచ్‌

దోమ చిన్నదయినా పెద్ద ప్రాణం తీస్తుంది. ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాంతక డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలే సీజన్‌ ఇదే. దీన్ని దృష్టిలో పెట్టుకుని దోమల నివారణ చర్యలు చేపట్టాలి. ఆసుపత్రికి వచ్చే రోగులను పరిశీలస్తే ఎక్కువగా దోమకాటు బాధితులే ఉంటున్నారు.

ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం

- డాక్టర్‌ పెంచలయ్య, డీఎంహెచ్‌వో

దోమల నివారణపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి లార్వా దశలోనే దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాము. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వైద్యం చేయించు కోవాలి. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు గతంలో జీజీహెచ్‌లోనే ఉండేవి. ఇప్పుడు ఆత్మకూరు జిల్లా ఆసుపత్రితోపాటు కావలి, కందుకూరు ఏరియా ఆసుపత్రులలోనూ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

============

Updated Date - 2023-08-19T23:38:08+05:30 IST