Share News

ఐఏబీకి ముహూర్తం కుదిరింది!

ABN , First Publish Date - 2023-11-06T23:27:49+05:30 IST

సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించాలని కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ నిర్ణయించారు.

 ఐఏబీకి ముహూర్తం కుదిరింది!
కలెక్టరేట్‌ ముందు బైఠాయించిన టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్న పోలీసులు

రబీ సీజన్‌లో సాగుపై నిర్ణయం ఎటో!?

సోమశిలలో 29, కండలేరులో 11 టీఎంసీలు

తాగునీటికి పోను సేద్యానికి సరిపోతాయా!?

ఇప్పటికే సాగుకు పూనుకోవద్దన్న అధికారులు

నీరివ్వాలంటూ రైతుల ఆందోళన

నెల్లూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించాలని కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ముందుగా 13వ తేదీ అనుకున్నప్పటికీ ఆ రోజున దీపావళి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించడంతో సమావేశాన్ని మరుసటిరోజుకు మార్చారు. జిల్లాలో కీలకమైన రబీ సాగుకు సంబంధించి నీటి కేటాయింపులపై ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా అక్టోబరులో ఐఏబీ నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలో వర్షాలు లేకపోవడంతోపాటు సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ఐఏబీ ఆలస్యమైంది. ఐఏబీ నిర్వహించే వరకు సాగుకు పూనుకోవద్దని ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు విజ్ఞప్తి చేసి ఉన్నారు. అయితే సాగుకు అదునుదాటుతుండటంతో రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల నార్లు పోసుకుంటున్నారు. దీంతో ఇక ఆలస్యం లేకుండా ఉన్న నీటిని పరిగణలోకి తీసుకొని ఐఏబీ నిర్వహించి సాగుపై నిర్ణయం తీసుకోవాలని ఐఏబీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌ నిర్ణయించారు.

సాగుపై నిర్ణయం ఎటో?

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రబీ సీజన్‌లో ఎనిమిది లక్షల ఎకరాలకుపైగా సాగు జరుగుతుంది. సోమశిల, కండలేరు జలాశయాల్లోని నీటి ఆధారంగా కేటాయింపులు జరుపుతారు. గతేడాది వరకు భారీ వర్షాలు కురవడం, పుష్కలంగా నీరు రావడంతో పూర్తి ఆయకట్టులో సాగు జరిగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఈ ఏడాది 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. రెండు జలాశయాలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో రబీ సాగుపై ఐఏబీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సోమశిలలో 29 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో రావడం లేదు. తాగునీటి అవసరాలకు రోజుకు 300 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నారు. నవంబరు దాటితే ఇక వర్షాలు కురవడం దాదాపు అసాధ్యమని గత అనుభవాలు చెబుతున్నాయి. దీంతో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్‌ స్టోరేజీ 7.50 టీఎంసీలు, నీటి ఆవిరి 2-3 టీఎంసీలు పోను నికరంగా 19 టీఎంసేల మిగులుతాయి. అందులో జిల్లాతో పాటు చెన్నైకు తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు జరపాలి. ఇవి పోను ఇక ఎంత నీరు మిగులుతుంది? సాగుకు ఇచ్చేందుకు ఎంత వరకు అవకాశముంటుంది? అన్న అంశాలపై జలవనరుల శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. అలానే కండలేరులో 11 టీఎంసీలు నీరు ఉండగా డెడ్‌ స్టోరేజీ 8.40 టీఎంసీలు, ఆవిరికి మరో రెండు టీఎంసీలు లెక్కలు వేసుకున్నా ఇక సాగుకు మిగలవని భావిస్తున్నారు. అప్పుడు కండలేరు పరిధిలో కూడా తాగునీటి అవసరాలకు కొరత ఏర్పడుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో జిల్లా రైతాంగం పరిస్థితేమిటన్నది సందిగ్ధంగా మారింది. కాగా డెల్టా రైతాంగం మాత్రం నార్లు పోసుకునేందుకు ముందు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కోవూరు, కావలి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు రైతులతో కలిసి సోమవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారికి, జిల్లా అధికారులకు మధ్య నీటి విషయంలో వాగ్వివాదం జరిగింది. అలానే మనుబోలు సిస్టం చెరువుల ఆయకట్టు రైతులు కండలేరు కింద తమకు లోయర్‌ రైపేరియన్‌ హక్కు ఉందని, తమకు వెంటనే నీరు విడుదల చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

రైతుల హక్కుల కోసం టీడీపీ ఆందోళన

నెల్లూరు (హరనాథపురం) : డెల్టా ప్రాంత రైతుల హక్కుల కోసం కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేశారు. ముట్టడి అనంతరం కలెక్టర్‌ హరినారాయణన్‌ను రైతులతో కలిసి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిలో కోవూరు డెల్టా ప్రాంత రైతులకు ఉన్న ప్రత్యేక హక్కుల ప్రకారం మొదటి పంటకు నీరివ్వాలన్నారు. అయితే సోమశిలలో 30 టీఎంసీల నీరు ఉన్నా, తాము చెప్పే వరకు పంటలు వేయకండని అధికారులు పత్రికాముఖంగా ప్రకటన జారీ చేయడం రైతులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. కనిగిరి రిజర్వాయర్‌ గేట్లు సరిగా లేకపోవటంతో ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు ప్రతి రోజూ 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు ఈస్ట్రన్‌ ఛానల్‌ ద్వారా లీక్‌ అవుతోందని చెప్పారు. దీనివల్ల ఇప్పటివరకు దాదాపు 1.5 టీఎంసీల నీరు వృఽథాగా సముద్రంలో కలిసి పోయిందన్నారు. ఇది ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. కోవూరు డెల్టాప్రాంత రైతులకు ప్రత్యేక హక్కుగా ఉన్న తొలిపంటకు నీరు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. రైతులు పంటలు వేయకపోతే రైతులు మాత్రమే కాదు రైతు కూలీలు నుంచి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిలేక నష్టపోతారని తెలిపారు. అన్ని విధాలుగా పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:27:51+05:30 IST