హరోం.. హర హర

ABN , First Publish Date - 2023-02-20T23:44:05+05:30 IST

నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది.

హరోం.. హర హర
రథోత్సవంలో భక్తజన సందోహం

నెల్లూరు (సాంస్కృతికం), ఫిబ్రవరి 20 : నెల్లూరులో మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హర నామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రథోత్సవం సందర్భంగా ఉదయం మూలస్థానేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పూజలు, స్వర్ణకవచ అలంకారము జరిగాయి. భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పాలంకారం జరిగాయి. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండు మేళం, భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు రాజీ యాడ్స్‌ పెంచలయ్య మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే తాగునీరు, ప్రసాదాలు, శీతల పానీయాలను పలువురు భక్తులు, వ్యాపారులు పంపిణీ చేశారు. ఈ ఉత్సవంలో ఆలయం చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ఉభయకర్త ఆల్తూరి గిరీష్‌రెడ్డి కుటుంబ సభ్యులు, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఈవోలు వేణుగోపాల్‌, పెంచలకోన జనార్దన్‌ రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మూలాపేటలోని అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వరస్వామికి చిన్నరథోత్సవం ఘనంగా జరిగింది.

Updated Date - 2023-02-20T23:44:53+05:30 IST