గేదెలు ఇవ్వకుండానే రూ.2,800 కోట్ల స్వాహా
ABN , First Publish Date - 2023-11-19T23:44:50+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ నాయకులు లబ్ధిదారులకు పాడి గేదెలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి రూ.2,800 కోట్ల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు.

ఉదయగిరి రూరల్, నవంబరు 19: రాష్ట్రంలో వైసీపీ నాయకులు లబ్ధిదారులకు పాడి గేదెలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి రూ.2,800 కోట్ల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక చెంచలబాబు అతిథి గృహంలో టీడీపీ మండల కన్వీనర్ బయ్యన్న అధ్యక్షతన క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు తక్కువ ధరకు టెండర్ వేసి జామాయిల్ కటింగ్‌లో రూ.300 కోట్లు దోచుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరిచి దోచుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెంచలబాబుయాదవ్, నియోజకవర్గ పరిశీలకులు వికాస్‌హరికృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, నాయకులు రియాజ్, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, గడ్డం వెంకట్వేర్లు, ఓబులరెడ్డి, సందానీ తదితరులు పాల్గొన్నారు.