పచ్చని కుటుంబంలో కల్లోలం

ABN , First Publish Date - 2023-02-04T23:31:07+05:30 IST

పేద కుటుంబమైనా ఉన్నంతంలో ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంపై కాలం కినుకు వహించింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేదింటి పెద్దదిక్కును పొట్టన పెట్టుకుంది.

పచ్చని కుటుంబంలో కల్లోలం
ముళ్ల చెట్ల కొమ్మలో ఇరుక్కున్న సిద్ధార్థను బయటకు తీస్తున్న స్థానికులు

హైవేపై బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా

తండ్రీ కూతుళ్ల దుర్మరణం.. కుమారుడి పరిస్థితి విషమం

పేద కుటుంబమైనా ఉన్నంతంలో ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంపై కాలం కినుకు వహించింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పేదింటి పెద్దదిక్కును పొట్టన పెట్టుకుంది. అంతేగాక, ఆ ఇంటి దీపాలైన కుమార్తెనూ కబళించగా, కొడుకును ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. రాపూరు మండలం వెలుగోను-ఏపూరు మార్గమధ్యంలో జాతీయరహదారిపై (నెం.565) వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో నెల్లూరుకు తలించారు.

రాపూరు, పిబ్రవరి 4 : గుండవోలు గ్రామానికి చెందిన గంగోటి ప్రతాప్‌ ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ను పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన పిల్లలు వైష్ణవి, సిద్ధార్థలకు జ్వరం రావడంతో శణివారం ఉదయం బైక్‌పై రాపూరుకు తీసుకువచ్చి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మధ్యాహ్నం తిరుగు పయణమయ్యారు. ఏపూరు గ్రామ సమీపంలో జాతీయరహదారిపై కర్నూలు వైపు నుంచి వస్తున్న ఇన్నోవా కారు అతి వేగంగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ధాటికి హైవేకు 20 అడుగుల దూరంలో బిడ్డలు సహా తండ్రి ప్రతాప్‌ ఎగిరి పడ్డారు. పది అడుగుల ఎత్తులో చెట్టుకొమ్మపై బాలుడు సిద్ధార్థ ఇరుక్కుపోయాడు. ఘటన జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి, చెట్టుకొమ్మల్లో ఇరుక్కుని ఉన్న సిద్ధార్థను కిందకు దింపి రోడ్డుమీదకు చేర్చారు. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో హైవే అంబులెన్సలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్‌ఐ క్రాంతికుమార్‌ రోడ్డుకు దూరంగా పడి ఉన్న జీ.ప్రతాప్‌ (35) తనయ వైష్ణవి (10) మృతదేహాలను రోడ్డు మీదకు తీసుకొచ్చారు. బాలుడు సిద్ధార్థ (9) పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారకులైన వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్‌ తెలిపారు.

గంటల్లోనే ఆనందం ఆవిరి

అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను ఆసుపత్రిలో చూపించి త్వరగా వచ్చేస్తానన్న భర్త విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ ఇల్లాలు గుండెలవిసేలా విలపించింది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే మృతుడి తల్లిదండ్రులు గంగోటి పురుషోత్తం, అన్నపూర్ణమ్మ, భార్య ప్రభావతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో విగతజీవులుగా పడి ఉన్న తండ్రీకూతుళ్ల మృతదేహాలను చూసి బంధువులు బోరున విలపించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, మనుమరాలి మృతితో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. మనవడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకుని ఇక తమకు దిక్కెవరంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ..

మృతుడు ప్రతాప్‌ కండలేరు ముంపు వాసి కావడంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసినట్లు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని అందరికీ చెబుతుండేవాడని, ప్రస్తుతం జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అందరితో కలుపుగోలుతనంగా ఉండే ప్రతాప్‌ ఇక లేడని తెలియడంతో గుండవోలులో విషాదం అలుముకుంది.

చురుకైన విద్యార్థులు

గుండవోలు పాఠశాలలో వైష్ణవి 5వ తరగతి, సిద్ధార్థ 4వ తరగతి చదువుతున్నట్లు హెచఎం కృష్ణ తెలిపారు. ఎంతో చురుకుగా ఉండే పిల్లల్లో ఒకరు మృతి చెందడం, మరొకరు మృత్యువుతో పోరాడుతుండటంతో బాధేస్తోందని ఆవేదన చెందారు. సిద్ధార్థ తిరిగి పాఠశాలకు రావాలని కోరుతూ సహచర విద్యార్థులు ప్రార్థనలు చేశారు.

Updated Date - 2023-02-04T23:31:10+05:30 IST