ఎన్ని రోజులైనా పోరాటం!!
ABN , First Publish Date - 2023-09-24T00:04:02+05:30 IST
తమ నాయకుడు చంద్రబాబునాయుడు కోసం ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు.

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు
వాయిద్యాలతో నాయీ బ్రాహ్మణుల నిరసన
నెల్లూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తమ నాయకుడు చంద్రబాబునాయుడు కోసం ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం దీక్షలు చేస్తూనే ఉంటామని వారు ప్రకటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు 11వ రోజు కూడా కొనసాగాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ శనివారం సామూహిక రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ప్రతి చోటా వివిధ వర్గాలు పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. ‘బాబుతో నేను’ ప్లకార్డులను చేతపట్టి నిరసన కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో నాయకులు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సామూహిక రిలే దీక్ష జరిగింది. నగరంలోని అన్ని డివిజన్ల నేతలతోపాటు కార్యకర్తలు, అభిమానులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబును, అదే వ్యవహారంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నాడు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందిన నేడు దేశ,విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత చంద్రబాబు కోసం రోడ్లపైకి వస్తుండడమే ఆయన కార్యదక్షతకు నిదర్శనమని కొనియాడారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, నాయకులు పీ చెంచలబాబుయాదవ్, కరీముల్లా, తాళ్లపాక అనురాధ, ధర్మవరం సుబ్బారావు, మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు, పనబాక భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వాయిద్యాలతో నాయీ బ్రాహ్మణుల నిరసన
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో 11వ రోజు కూడా సామూహిక రిలే దీక్ష కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం పెద్ద సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు వాయిద్యాలతో పాల్గొని నిరసన తెలిపారు. ‘చంద్రబాబుతో నేను’ ప్లకార్డులను చేతపట్టుకొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు మేలు చేస్తే హర్షిస్తారుతప్ప అక్రమ అరెస్టులు, వేధింపులు, నిర్బంధాలు, లాఠీలు, దౌర్జన్యాలతో ఎక్కువకాలం అధికారం సాగించలేరని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, సరైన సమయంలో ఓటుతో సమాధానం చెబుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనం ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డపనేని రాజానాయుడు, జెన్ని రమణయ్య, ఈదర శ్రీనివాసులు, చేజర్ల మహేష్, జలదంకి సుధాకర్, సాబీర్‌ఖాన్, మన్నెం పెంచలనాయుడు, సారంగం గున్నయ్య, కంటే సాయిబాబా, నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
================