ఎగరని డ్రోన్‌.. నెరవేరని లక్ష్యం!

ABN , First Publish Date - 2023-09-25T00:05:46+05:30 IST

వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంతోపాటు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కిసాన్‌ డ్రోన్‌ కార్యక్రమం చేపట్టింది.

ఎగరని డ్రోన్‌..  నెరవేరని లక్ష్యం!
నెల్లూరు రూరల్‌ మండలంలో కిసాన్‌ డ్రోన్‌తో పురుగు మందుల పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్న నెల్లూరు ఏడీఏ శ్రీనివాసులు, మండల ఏవో నాగమోహన్‌ (ఫైల్‌)

మూడు కాదు.. ఒక్క డ్రోన్‌ అయినా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం

కుస్తీ పడుతున్న వ్యవసాయ శాఖ అధికారులు

వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంతోపాటు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కిసాన్‌ డ్రోన్‌ కార్యక్రమం చేపట్టింది. గత ఖరీ్‌ఫలోనే రైతులకు ఈ పథకం ఫలాలు అందివ్వాలని నిర్ణయించుకున్నా నిబంధనలు, ఎంపికలు, శిక్షణ తదితర విషయాల్లో జాప్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఒక్కో మండలానికి మూడు డ్రోన్లు కేటాయించినా అర్హులైన పైలెట్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కనీసం కనీసం ఒక్క డ్రోన్‌ అయినా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు (వ్యవసాయం), సెప్టెంబరు 24 : జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. వరితోపాటు పలు ఉద్యాన పంటలకు డ్రోన్ల సాయంతో పురుగు మందులు పిచికారీ చేయాలన్నది ప్రభుత్వ ముఖ్యఉద్దేశం. దీనిపై వ్యవసాయాధికారులు మండలస్థాయిలో డ్రోన్‌తో మందుల పిచికారీ డెమో కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వీటిని నడిపే పైలెట్ల ఎంపిక ప్రక్రియను గత ఏప్రిల్‌లో ప్రారంభించారు. కానీ పూర్తిస్థాయిలో అర్హులైన వారు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలను కుదిస్తూ గడువు పెంచుకుంటూ వస్తున్నారు. డ్రోన్లు అందుబాటులోకి వస్తే మందుల పిచికారీకి అయ్యే కూలీల ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్న రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ రబీ సీజన్‌ ప్రారంభానికి మండలానికి కనీసం ఒక్క డ్రోన్‌ అయినా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే చర్యలు చేపడుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 21 గ్రూపులను ఏర్పాటు చేశారు.

మండలానికి మూడు..

జిల్లాలో ఒక్కో మండలానికి మూడు చొప్పున మొత్తం 37 మండలాలకు 111 డ్రోన్ల లక్ష్యాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే నిబంధనల ప్రకారం అర్హులైనవారు అందుబాటులో లేకపోవడంతో మండలానికి కనీసం ఒక్కరినైనా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంపికైన వారికి విజయవాడలో ఉచిత శిక్షణకు పంపుతున్నారు. అది పూర్తి చేసుకున్న వారికి పైలట్‌ లైసెన్సు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యవసాయ భూమి ఉండాలి. అంతేగాక పాస్‌పోర్టు కూడా తప్పనిసరి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా వారు అనర్హులు. దీనికితోడు డ్రోన్‌ ఖరీదులో 10శాతం పైలెట్‌ చెల్లించడం ఓ నిబంధన. దీంతో యువత ముందుకు రావడం లేదు. జిల్లాలోని 37 మండలాలకుగాను ఇప్పటివరకు 15మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరో ఏడుగురు శిక్షణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రబీకి కనీసం కొన్ని మండలాల్లోనైనా డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.

నిబంధనలే కొర్రీ!

డ్రోన్‌ పైలట్‌గా ఎంపికయ్యే అభ్యర్థులకు వ్యవసాయ భూమి తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఇంటర్‌ పూర్తి చేయాలి. పాస్‌పోర్టు ఉండాలి. 12 రోజులపాటు విజయవాడలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మూడేళ్లపాటు సేవలందిస్తామనే అంగీకారపత్రం అందజేయాలి. ఇక డ్రోన్‌ ఖరీదు రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంటుందని అంచనా. గ్రూపు ఏర్పాటు చేసిన తరువాత ఆ గ్రూపునకు ప్రభుత్వం 40శాతం రాయితీ ఇస్తుంది. 50 శాతం బ్యాంకు రుణం అందిస్తారు. మిగిలిన 10శాతం పైలెట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ చదివిన యువత ముందుకొస్తే వారికి భూమి ఉండడం లేదని, ఇవి రెండూ ఉన్న వారికి పాస్‌పోర్టు లేకపోవడం అంతేగాక 10శాతం నగదు చెల్లింపులు కష్టతరంగా ఉండటంతో యువత ముందుకు రావడం లేదు. ఈ కారణాలతోనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.

=========

Updated Date - 2023-09-25T00:05:46+05:30 IST