పుస్తకాలు లేకుండా తరగతులా ?

ABN , First Publish Date - 2023-06-02T23:58:54+05:30 IST

పాఠ్య పుస్తకాలు ఉంటేనే బోధన సజావుగా సాగుతుంది. కళాశాల ప్రారంభం రోజున విద్యార్థుల చేతుల్లో వాటిని ఉంచితే ఆ ఆనందమే వేరు. జిల్లాలో 23 ప్రభుత్వ, 3 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

పుస్తకాలు లేకుండా తరగతులా ?
తరగతి గదిలో ఇంటర్‌ విద్యార్థులు(ఫైల్‌)

ఈ ఏడాది కూడా తప్పని ఇక్కట్లు ?

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 2: పాఠ్య పుస్తకాలు ఉంటేనే బోధన సజావుగా సాగుతుంది. కళాశాల ప్రారంభం రోజున విద్యార్థుల చేతుల్లో వాటిని ఉంచితే ఆ ఆనందమే వేరు. జిల్లాలో 23 ప్రభుత్వ, 3 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 4 వేలమంది ఉన్నారు. ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయాలి. ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్‌ సబ్జెక్టుల పుస్తకాలు ప్రభుత్వ ముద్రణాలయం నుంచి జిల్లాకు సరఫరా చేస్తారు. అనంతరం ఆర్‌ఐవో కార్యాలయం నుంచి అన్ని కళాశాలలకు పంపిణీ చేస్తారు. ప్రైవేటు విద్యార్థులకు మాత్రం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. గతేడాది కూడా ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయలేదు. వేసవి సెలవుల అనంతరం ఈనెల ఒకటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని అనిపిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు సరఫరా కాకపోవడమే.

ఆర్థికభారం

ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పడంలేదు. గతేడాది కూడా విద్యార్థులకు చివరి వరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. అధ్యాపకులు పూర్వ విద్యార్థుల వద్ద సేకరించి అందజేశారు. బహిరంగ మార్కెట్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థుల పుస్తకాలు రూ.3 వేలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పుస్తకాలు రూ.4 వేలు పలుకుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేదవారే. అంత నగదు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో పుస్తకాలు కొనాలంటే వారికి ఆర్థిక కష్టాలు తప్పవు. ప్రభుత్వం స్పందించి ఈ ఏడాదైనా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సమాచారం లేదు..

ఇంటర్‌ పాఠ్యపుస్తకాల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం.

- మధుబాబు, డీవీఈవో

============

Updated Date - 2023-06-02T23:59:17+05:30 IST