భయపెడుతున్న భూసమస్యలు

ABN , First Publish Date - 2023-09-18T00:50:39+05:30 IST

నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరు పరిధిలో ఓ కుటుంబానికి చెందిన భూమిని, మరొకరి పేరుపై మ్యుటేషన్‌ చేశారు. అయ్యా... ఇది మా భూమి.. మా పేరుపై మ్యుటేషన్‌ చేయండి..

భయపెడుతున్న భూసమస్యలు
ఈనెల 15న రాపూరు మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక స్పందనలో అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

‘స్పందన’లో మూడోవంతు అర్జీలు అవే..

రాజకీయ ప్రమేయంతోనే అధికమవుతున్న వివాదాలు

ఉన్నతాధికారుల వద్ద బోరుమంటున్న బాధితులు

నాలుగేళ్లుగా ఇష్టానుసారం రికార్డుల మార్పు

నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరు పరిధిలో ఓ కుటుంబానికి చెందిన భూమిని, మరొకరి పేరుపై మ్యుటేషన్‌ చేశారు. అయ్యా... ఇది మా భూమి.. మా పేరుపై మ్యుటేషన్‌ చేయండి.. అంటూ సదరు కుటుంబ సభ్యులు అధికారుల వద్దకు వెళితే అది ప్రభుత్వ భూమి అని, మీ పేరుపై మ్యుటేషన్‌ చేయడం కుదరదని వారు సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా మా దగ్గర ఉంటే మరొకరి పేరుపై మ్యుటేషన్‌ చేయడమేకాక అది ప్రభుత్వ భూమి అని చెబుతున్నారని సదరు బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు... ఇలా మొత్తం 30 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్‌ చేసినట్లు తేలింది. ప్రభుత్వ ప్లీడర్‌ల ఒపీనియన్‌ పేరుతో హైకోర్టు స్టేటస్‌కోను కూడా రెవెన్యూ అధికారులు ఉల్లంఘించారు. దీనిపై న్యాయం చేయండి.. అంటూ బాధితులు ఏడాదిగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.

మర్రిపాడు మండలంలో ఓ కుటుంబానికి గతంలో అసైన్‌మెంట్‌ భూమి పంపిణీ చేశారు. ఆ కుటుంబమే ఆ భూమిని సాగు చేసుకుంటున్నా రికార్డుల్లో మాత్రం వేరొకరి పేర్లు వచ్చి చేరాయి. ఆ తర్వాత అధికార బలంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ దౌర్జన్యం ఏందయ్యా అంటూ.. సదరు బాధితులు ఎక్కని కార్యాలయం మెట్టు లేదు.. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

-నెల్లూరు, ఆంధ్రజ్యోతి

పైరెండు ఉదాహరణలు దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యలవి. భూ వివాదాలు పరిష్కారం కాక బాధితులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, ఉంటే వీటికి తోడు రోజురోజుకూ భూసమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా డీకేటీ భూముల రికార్డుల తారుమారు, ప్రభుత్వ భూముల రికార్డుల మార్పు, ఒకరి భూమిని మరొకరి పేరుపైకి మార్చడం వంటి సమస్యలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల, సిబ్బంది అవినీతి, రాజకీయ జోక్యం ఎక్కువవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో భూసమస్యలు ఏ స్థాయికి చేరాయంటే స్పందన కార్యక్రమానికి వచ్చేవారిలో మూడోవంతు మంది ఈ సమస్యలతోనే అర్జీలు పట్టుకొస్తుండడం గమనార్హం. గత సోమవారం జిల్లాలో జరిగిన స్పందనలో మొత్తం 495 అర్జీలు రాగా, వాటిలో 343 అర్జీలు రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. రెండు రోజుల క్రితం దగదర్తి మండలంలో కలెక్టర్‌ స్పందన నిర్వహించగా 110 అర్జీలు వచ్చాయి. అందులో మూడో వంతు భూసమస్యలే ఉన్నాయి. శుక్రవారం రాపూరులో నిర్వహించిన ప్రత్యేక స్పందనలో కూడా 144 అర్జీలు రాగా, భూసమస్యలే అధికంగా వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు క్షేత్రస్థాయిలో భూసమస్యలు ఎలా ఉన్నాయన్నది.

సామాన్యులకు తిప్పలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో పరిశీలిస్తే రోజురోజుకూ భూసమస్యలు పెరుగుతున్నాయి. చాలా మండలాల్లో ఇష్టానుసారంగా రికార్డులు మార్చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడమే కాకుండా, ఆఖరుకు డీకేటీ భూముల రికార్డులను కూడా తారుమారు చేశారు. ఇలాంటి రెవెన్యూ లీలలు అనేకం వెలుగు చూశాయి. ఈ విషయంలో పలువరు తహసీల్దార్లు, కింది స్థాయి సిబ్బందిపై వేటు కూడా పడింది. ప్రస్తుతం కలెక్టర్‌, జేసీ కఠినంగా వ్యవహరిస్తుండడంతో రికార్డుల మార్పు చాలావరకు తగ్గినా, గతంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రీసర్వే జరుగుతున్న సమయంలో ఈ అవకతవకలు బయటపడుతుండడంతో బాధితులు ఉన్నతాధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది, అధికార పార్టీ నేతలు చేసిన పాపాలకు ఇప్పుడు సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

పోటీ పడుతున్న ఆత్మకూరు

ఇప్పటివరకు నెల్లూరు డివిజన్‌లో భూసమస్యలు అధికంగా వస్తుండగా, ఇప్పుడు ఆత్మకూరు డివిజన్‌ కూడా పోటీ పడుతోంది. ఇటీవల కలెక్టర్‌ అక్కడ ప్రత్యేక స్పందన నిర్వహించగా సుమారు 300 అర్జీలు వస్తే అందులో 200 వరకు భూసమస్యలే ఉన్నట్లు సమాచారం. వాటిలో పలు కీలక వ్యవహారాలు కలెక్టర్‌ దృష్టికి వచ్చాయని, ఆ అర్జీలను స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఇవ్వకుండా కలెక్టర్‌నే నేరుగా వెంట తీసుకెళ్లారని అక్కడి అధికారులు చెబుతుండడం గమనార్హం.

============

Updated Date - 2023-09-18T00:50:39+05:30 IST