బదిలీలపై సందిగ్ధం

ABN , First Publish Date - 2023-06-03T00:02:27+05:30 IST

ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసినా పలు శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గతనెల 31తో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది.

బదిలీలపై సందిగ్ధం
బదిలీలు చేపడుతున్న ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి

గడువు ముగిసినా కసరత్తు కొనసాగింపు

రాజకీయ జోక్యంతో మార్పుచేర్పుల జోరు

ఉత్కంఠగా ఉద్యోగుల ఎదురుచూపులు

నెల్లూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసినా పలు శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గతనెల 31తో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. ఈనెల 1నుంచి బదిలీలపై నిషేధం ఉంది. అయినా కీలకమైన శాఖల్లో ఇంకా బదిలీలు జరగకపోవడం గమనార్హం. దీంతో ఆయా శాఖల ఉద్యోగులు తమను ఎక్కడకు పంపుతారోనంటూ ఓవైపు భయంగా, మరోవైపు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత నెల 22 నుంచి బదిలీల ప్రక్రియ మొదలైంది. పదిరోజులపాటు అన్ని శాఖల్లో సాధారణ బదిలీలకు ప్రభుత్వం గడువిచ్చింది. ఐదేళ్లు దాటిన వారిని కచ్చితంగా, రెండేళ్లు దాటిన వారికి రిక్వెస్ట్‌పై బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీలు చేసేలా ఆయా శాఖల హెచ్‌వోడీలకు ప్రభుత్వం అధికారాలిచ్చింది. దీంతో మొదటివారంలోనే ఉద్యోగులంతా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.

లోపించిన పారదర్శకత

ఎమ్మెల్యేలు చెప్పిన వారినే చెప్పిన స్ధానాలకు బదిలీ చేయాలంటూ హుకుం జారీ చేయడంతో బదిలీలలో పారదర్శకత కొరవడింది. ఇది ఆయా శాఖల హెచ్‌వోడీలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలు పంపిన లేఖలన్నింటిని పరిగణలోకి తీసుకుని బదిలీలు కొనసాగించారు. చాలా శాఖల్లో గత నెల 31లోపే బదిలీలు పూర్తయ్యాయి. అయితే కీలకమైన ఇరిగేషన్‌, పశుసంవర్ధకశాఖ, జిల్లా పంచాయతీశాఖ, వైద్యశాఖ, విద్యాశాఖల్లో నిర్ణీత గడువులోగా బదిలీలు పూర్తి కాలేదు. అయితే అనేక తర్జనభర్జనల అనంతరం శుక్రవారం రెవెన్యూచ పోలీసులు, రవాణాశాఖ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ విభాగాల్లో బదిలీలు జరిగాయి. వైద్యం, పశుసంవర్ధక, కార్మికశాఖ, ఇరిగేషన్‌ శాఖల్లో బదిలీలు జరుగుతాయని శుక్రవారం రాత్రి వరకు ఆయా ఉద్యోగులు ఎదురుచూశారు. కానీ ఉత్తర్వులు విడుదల కాలేదు. రెవెన్యూశాఖలో 47 మంది డిప్యూటీ తహసిల్దార్లు,సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్ల బదిలీలు జరిగాయి. శుక్రవారం రాత్రి వీరు బదిలీల ఉత్తర్వులు అందుకున్నారు.

ఐదు సబ్‌డివిజన్లలో 160 మందికి స్థానచలనం

ప్రశాంతంగా పోలీసుల బదిలీ

నెల్లూరు(క్రైం): జూన్‌ 2: పోలీసుల బదిలీల పక్రియ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు సబ్‌ డివిజన్ల పరిఽధిలో 19మంది ఏఎస్‌ఐలు, 47మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 94 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 160 మందిని బదిలీ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్‌ కే తిరుమలేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముందుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రొజెక్టర్‌పై ప్రదర్శించి సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపట్టామన్నారు. అనారోగ్యం, స్పౌజ్‌, ప్రత్యేక అవసరాల కేసుల్లో మాత్రమే అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డీ హిమవతి, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

రవాణాశాఖలో...

నెల్లూరు ఉపరవాణాశాఖ కార్యాలయం నుంచి ఇద్దరు బదిలీపై వెళ్లగా, ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరుకు ఇద్దరు వచ్చారు. పరిపాలన అధికారిగా ఉన్న వంశీ గుంటూరుకు బదిలీ కాగా గుంటూరులో విధులు నిర్వహిస్తున్న సత్యక్రాంతి నెల్లూరుకు బదిలీ అయ్యారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ ఒంగోలుకు బదిలీ కాగా, అక్కడ నుంచి సీహెచ్‌ కృష్ణయ్య నెల్లూరుకు వచ్చారు. బదిలీపై వచ్చిన వారు శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు.

వైద్యశాఖ బదిలీల్లో అక్రమాలు

ఆర్డీ కార్యాలయం వేదికగా తంతు

ఒక్కో ట్రాన్స్‌ఫర్‌కు రూ. 30వేలు

పాత తేదీలతో స్థానచలనం

నెల్లూరు(వైద్య) జూన్‌ 2: వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన పరస్పర అంగీకార బదిలీ(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)ల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు రీజనల్‌ డైరెక్టర్‌ (అర్డీ) కార్యాలయం వేదికగా ఈ బదిలీలకు జిల్లాకు చెందిన ఉద్యోగులు ముడుపులు చెల్లించుకోక తప్పలేదు. ముడుపులు ఇవ్వందే మ్యూచ్‌వల్‌ ట్రాన్స్‌ఫర్లకు అధికారులు ససేమిరా అనడంతో ఉద్యోగులు అడిగినంత చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఉద్యోగుల పరస్పర అంగీకార బదిలీలకు అధికారులు సహకారం అందించాలి. అయితే ఇందులోనూ అధికారులు అవినీతికి తెరతీయటం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చర్చనీయాంశమైంది.

ఐదురోజులే గడువు

ప్రభుత్వం గతనెల 20న జీవో నెంబర్‌ 371 విడుదల చేసింది. దీని ద్వారా మ్యూచ్‌వల్‌ ట్రాన్స్‌ఫర్లకు అనుమతి ఇచ్చింది. అదేనెల 25 కల్లా పక్రియ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆర్డీ అధికారులు ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాత తేదీలతో బదిలీలు

ఐదురోజుల్లోనే ఈ బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా ఆర్టీ కార్యాలయం అధికారులు గతనెల 30 వరకు పక్రియను నిర్వహించారు. పాత తేదీలతో ఈ బదిలీలు కొనసాగించి అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్ట్‌లు, ఎంపీహెచ్‌ఎస్‌(మగ), సబ్‌యూనిట్‌ అధికారులకు సంబంధించి ఈ మ్యూచ్‌వల్‌ ట్రాన్స్‌ఫర్‌లు జరిగాయి. మొత్తం 40 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీరి వద్ద నుంచి ఆర్డీ కార్యాలయం అధికారులు రూ. 12 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కాగా విశాఖపట్నం వైద్యఆరోగ్యశాఖలో జరిగిన మ్యూచ్‌వల్‌ ట్రాన్స్‌ఫర్లలో అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్నబాబు దృష్టికి వెళ్లటంతో, ఆయన ఆ బదిలీలను ఆపేశారు. నెల్లూరులో జరిగిన బదిలీలపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

======

Updated Date - 2023-06-03T00:02:27+05:30 IST