అంతా తెలిసే చేశారా!?

ABN , First Publish Date - 2023-05-26T00:40:20+05:30 IST

చిల్డ్రన్స్‌పార్క్‌ రోడ్డు పక్కనున్న స్థలం రిజిస్ట్రేషన్ల గూడుపుఠాణి తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలూ రేకెత్తుతున్నాయి. మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ సుమారు రూ.10 కోట్లకు పైమాటే. ఇంత విలువైన ఆస్తిని కొనుగోలు చేసే క్రమంలో ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరగలేదంటేనే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

అంతా తెలిసే చేశారా!?

క్రయ విక్రయదారుల మధ్య రహస్య ఒప్పందం

చిల్డ్రన్స్‌పార్క్‌ రోడ్డు పక్కనున్న స్థలం రిజిస్ట్రేషన్ల గూడుపుఠాణి తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలూ రేకెత్తుతున్నాయి. మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తి విలువ సుమారు రూ.10 కోట్లకు పైమాటే. ఇంత విలువైన ఆస్తిని కొనుగోలు చేసే క్రమంలో ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరగలేదంటేనే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఆస్తిని విక్రయించిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తులు ఒక రహస్య అవగాహనతో విక్రయ పత్రాలు రాసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్‌, ఆ తర్వాత పరిణామాలను లోతుగా పరిశీలిస్తే ఒక పథకం ప్రకారమే క్రయ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

నెల్లూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): పది కోట్ల రూపాయల ఆస్తిని అమ్మే వ్యక్తి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అప్పుగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాడా!? అలా ఇచ్చాడంటే నమ్మగలమా!? ఈ వ్యవహారంలో అదే జరిగింది. దగ్గుపాటి శ్రీధర్‌రావు అనే వ్యక్తి పేటేటి మహే్‌షకుమార్‌, చలువాది వెంకట సురే్‌షబాబు, కోట్ల సత్యనారాయణ, కోట్ల ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల పేర్లతో ఐదు డాక్యుమెంట్ల రూపంలో 270 అంకణాల స్థలాన్ని విక్రయించాడు. స్టాంప్‌ విలువ సుమారు రూ.3 కోట్లు. సాధారణంగా ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. కానీ నలుగురు కొనుగోలుదారుల్లో ఏ ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయదారుడికి చెల్లించలేదంటేనే అనుమానం కలుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విక్రయాలు నగదు రహితంగా జరిగాయని, పరిస్థితులు చక్కబడి ఈ స్థలాన్ని మరొకరికి అంటగట్టిన తరువాత వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకోవాలని కొనుగోలుదారులు, విక్రయదారుడి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరగకపోవడంపై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

వివాద స్థలమని తెలిసే కొన్నారా!?

ఇక ఈ వ్యవహారం ఆరంభంలో అందరూ కొనుగోలుదారులకు అన్యాయం జరిగిందని భావించారు. అయితే ఈ వ్యవహారాన్ని లోతుగా గమనిస్తే ఇది వివాదస్థలమని తెలిసే ఈ నలుగురు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వెబ్‌ల్యాండ్‌లో ఆ సర్వే నెంబరు కొడితే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎవరి పేరిట ఉందో ఇట్టే తెలిసిపోతుంది. వెబ్‌ల్యాండ్‌లో 809-ఏ సర్వే నెంబరు భూమి దేవిరెడ్డి కుటుంబీకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తిని కొనుగోలు చేసిన నలుగురిలో ఏ ఒక్క వ్యక్తి వెబ్‌ల్యాండ్‌ను చూడలేదంటే నమ్మాలా!? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేర్లు ఉన్నాయన్న విషయం తెలిసి, ఇది వివాదాస్పద వ్యవహారమని తెలిసే ఆ ఆస్తిని వారు కొనుగోలుకు సిద్ధపడినట్లు భావించాల్సి వస్తోంది.

వ్యూహాత్మకంగా కోర్టును ఆశ్రయించారా!?

కొనుగోలు వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తే విక్రయదారుడు, కొనుగోలుదారులు పథకం ప్రకారమే క్రయ, విక్రయాలు జరిపినట్లు అనిపిస్తోంది. కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించిన తీరు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. దేవిరెడ్డి వాయుసుత అనే మహిళ తన ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించారని పోలీస్‌ స్టేషన్‌లో మే 20వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఆస్తికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌ మార్పు కోరుతూ కొన్న నలుగురు మే 9వ తేదీనే నెల్లూరు 3వ మున్సిఫ్‌ కోర్టులో వాజ్యం వేశారు. అంటే ఏనాటికైనా దేవిరెడ్డి కుటుంబీకులు ఈ విషయమై ఫిర్యాదు చేస్తారని, దానికి ముందే న్యాయస్థానంలో ఈ వాజ్యానికి ప్రాణం పోసి వ్యవహారాన్ని కోర్టుపరిధిలోకి తెచ్చుకుంటే తాము సేఫ్‌ అవుతామనే ఉద్దేశంతో కోర్టులో వాజ్యం వేసినట్లు తెలుస్తోంది. ఈ భూమిని కొనుగోలు చేసిన నలుగురిలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యవహారాల్లో సిద్ధహస్తుడని, ఈయనపై ఇలాంటి అభియోగాలు చాలా ఉన్నాయనే ప్రచారం ఉంది. అయితే పోలీసులు మరో కోణంలో ముందుకెళ్లి నయానో, భయానో అమ్మినవారు, కొన్నవారిని ఇద్దరిని ఒకచోట చేర్చి రిజిస్ట్రేషన్లు రద్దు పరచడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఈ నలుగురు వ్యక్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినంత మాత్రాన ఈ స్థల వివాదం సద్దుమణిగే అవకాశం లేదు. ఈ భూమి నిజమైన హక్కుదారుల విషయంలో మాత్రం ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై రెవెన్యూ అధికారులు నిజాయితీగా పరిశీలిస్తే కోట్లాది రూపాయల భూమికి నిజమైన హక్కుదారులెవరో తెలుస్తోంది.

నకిలీ పత్రాల కేసులో నిందితుడి అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) : రూ.కోట్లు విలువ చేసే స్థలానికి నకలీ పత్రాలు సృష్టించారంటూ బాలాజీనగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. రామ్మూర్తినగర్‌కు చెందిన దేవిరెడ్డి వైయుశతకు జగదీ్‌షనగర్‌లో 1.34 ఎకరాల భూమి ఉంది. తన భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుండగా సదరు భూమికి నకిలీ పట్టా, సర్వే రిపోర్టులను సృష్టించారని తెలుసుకుంది. దీంతో ఈ నెల 20వ తేదీన ఆమె బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దుబగుంట గోపికృష్ణమూర్తి, దగ్గుమట్టి శ్రీధర్‌రావు, కోట సత్యనారాయణ, కోట ఈశ్వరచంద్రవిద్యాసాగర్‌, చలువది వెంకట సురే్‌షబాబు, పెట్టేటి మహే్‌షకుమార్‌, భీమకత్తి కుమారి, జీఎన్‌ పద్మశ్రీలపై సీఐ రాములు నాయక్‌ చీటింగ్‌ కేసు నమోదు చేశారు. భూమికి నకిలీ పట్టాలను సృష్టించింది శ్రీధర్‌రావు అని తేల్చామని, మిగిలిన వారు స్థలం కొనుగోలు చేశారే తప్ప వారికి నకిలీ పట్టాల గురించి తెలియదని సీఎం తెలిపారు. ఈ మేరకు ముద్దాయిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

===================

Updated Date - 2023-05-26T00:40:20+05:30 IST