అందని ద్రాక్షగా వైద్యం
ABN , First Publish Date - 2023-09-25T22:46:58+05:30 IST
ఉలవపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. మూడు నెలల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా ఆగిపోయాయి. దీంతో గర్భిణులు ఒంగోలు రిమ్స్‌కు, కందుకూరు ఏరి

సీహెచ్‌సీలో కు.ని. శస్త్రచికిత్సలకు మంగళం
వైద్యుల పోస్టుల ఖాళీ
30 పడకలకు ఇద్దరే దిక్కు
ఉలవపాడు, సెప్టెంబరు 25: ఉలవపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. మూడు నెలల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా ఆగిపోయాయి. దీంతో గర్భిణులు ఒంగోలు రిమ్స్‌కు, కందుకూరు ఏరియా ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. నాలుగు నెలల క్రితం జిల్లాలోనే ఉలవపాడు సీహెచ్‌సీ కు.ని. శస్త్రచికిత్సలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ప్రస్తుతం వైద్య నిపుణులు లేక ఆపరేషన్లు ఆగిపోయాయి. 30 పడకల ఆసుపత్రికి ఇద్దరు జూనియర్ డాక్టర్లే ఉండడంతో వారు సాధారణ వైద్యానికే పరిమితమయ్యారు. ఈఏడాది జూన్‌లో చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ ఎం సతీష్‌బాబును పోలవరానికి బదిలీ చేశారు. మత్తు వైద్యుడు సుబ్బారెడ్డి పదోన్నతిపై కావలికి బదిలీ కాగా, గైనకాలజిస్టు డాక్టర్ శివానంద్ సస్పెండ్ అయ్యారు. దీంతో గర్భిణలు, బాలింతలు, చిన్నపిల్లలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. గతంలో 300 ఉండే ఓపీ నేడు 50లోపు పడిపోయింది.
పోస్టులు భర్తీ చేయండి
సీహెచ్‌సీకి రూ.4.50 కోట్లతో నూతన భవనం నిర్మాణం, కావలసిన మౌలిక వసతులు కల్పించారు. అయితే వైద్యుల విషయంలో దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఐదుగురు వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.