వ్యవసాయమంటే కాకాణికి ఆసక్తే లేదు

ABN , First Publish Date - 2023-03-25T23:43:55+05:30 IST

వ్యవసాయమంటేనే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఆసక్తే లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

 వ్యవసాయమంటే కాకాణికి ఆసక్తే లేదు
మనవడు, మనవరాలతో కలిసి చిన్నారులకు నూతన వస్ర్తాలను పంపిణీ చేస్తున్న సోమిరెడ్డి

వెంకటాచలం, మార్చి 25 : వ్యవసాయమంటేనే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఆసక్తే లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రైతులను గాలికొదిలేశారన్నారు. ఆ శాఖనే మూతపడేలా చేశారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎన్నడూ రైతుల సమస్యలపై శాసనసభలో మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటే అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుండడం దురదృష్టకరమన్నారు. మొన్నటి వరకు వైసీపీకి బీసీలే వ్యతిరేకం అని అనుకుంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లు కూడా మారారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొదలకూరు మండలంలో గ్రావెల్‌ మాఫియా విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలకు పాల్పడిందన్నారు. 2024లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గుమ్మడి రాజాయాదవ్‌, కుంకాల దశరథ నాగేంద్రప్రసాద్‌, రావూరి రాధాకృష్ణమనాయుడు, బొమ్మి సురేంద్ర, చల్లా నాగార్జున్‌రెడ్డి తదితరులున్నారు.

ఘనంగా సోమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు

వెంకటాచలంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత సర్వేపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఓవైపు బాణసంచా, మరోవైపు పూలవర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మనవడు సోమిరెడ్డి రణదేవ్‌రెడ్డి, మనవరాలు సోమిరెడ్డి అమైరారెడ్డిలతో కలిసి సోమిరెడ్డి కట్‌ చేశారు. అనంతరం ఎనెల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు అనుకుని ఉన్న సెయింట్‌ జ్యూడ్స్‌ మానసిక దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు నూతన వస్ర్తాలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని సోమిరెడ్డి ప్రారంభించి, అందరితో కలిసి భోజనం చేశారు.

===========

Updated Date - 2023-03-25T23:43:55+05:30 IST