అధికారమే అండ.. కరుగుతున్న కొండ!
ABN , First Publish Date - 2023-08-10T23:53:08+05:30 IST
అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ కొండలను కరగదీస్తున్నారు. మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే ఏకమై కలెక్టర్‌తోపాటు మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విచారణకు ఆదేశించారు.
లీజుదారుడిని బెదిరించి సహజ సంపద దోపిడీ
గ్రామస్థుల ఫిర్యాదుతో అధికారుల్లో కదలిక
వెలుగులోకి వస్తున్న అక్రమాలు
అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ కొండలను కరగదీస్తున్నారు. మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే ఏకమై కలెక్టర్‌తోపాటు మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విచారణకు ఆదేశించారు. దీంతో అధికారుల్లో కదలిక ఏర్పడి కొన్ని రోజులుగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌లో అవినీతి, అక్రమాలు కోకొల్లలని తేలడంతో వారే నోరెళ్ల బెడుతున్నారు.
నెల్లూరు, ఆగస్టు 10 : దుత్తలూరు మండలంలోని బండకిందపల్లిలో నాణ్యమైన కంకర(మెటల్) నిక్షేపాలు ఉన్నాయి. పలువురు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని క్వారీలను నిర్వహిస్తుంటారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మండలంలోని అధికార పార్టీకి చెందిన నాయకుల కన్ను వాటిపై పడింది. ఇంకేముంది.. అధికారమే అండగా క్వారీ యజమానులను భయబ్రాంతులకు గురి చేసి క్వారీని లీజుకు తీసుకున్నట్లు రాయించుకున్నారు. ఆ లీజును అడ్డం పెట్టుకొని అధికారులను లోబర్చుకొని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ సహజసంపదలను కరిగించేసి కోట్ల రూపాయలను కూడబెట్టుకుంటున్నారు. 322, 323, 324 సర్వే నెంబర్లలోని సుమారు 8.50 మేత, కొండ పోరంబోకు, భూముల్లో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేశారు. ఇటీవల నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరడంతో ఈ బాగోతం వెలుగచూసింది.
వివరాలు చెప్పేందుకు ససేమీరా
గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై గ్రామస్థులంతా కలిసి కలెక్టర్‌తోపాటు విజిలెన్స్, మైనింగ్ అధికారులకు ఇటీవల ఫిర్యాదులు చేశారు. వారు ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. మైనింగ్ శాఖకు చెందిన అధికారులు రెండు పర్యాయాలు గుట్టుచప్పుడు కాకుండా క్వారీపై దాడులు నిర్వహించారు. కానీ వివరాలు వెల్లడించలేదు. స్థానిక రెవెన్యూ అధికారులు సైతం వివరాలు చెప్పేందుకు వెనుకంజ వేస్తున్నారు. మంగళవారం సైతం మైనింగ్ అధికారులు సదరు క్వారీపై దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంపై మైనింగ్ శాఖకు చెందిన ఓ అధికారిని వివరణ కోరగా బండకిందపల్లిలో జరుగుతున్న మైనింగ్‌లో అవినీతి, అక్రమాలు భారీస్థాయిలో ఉన్నాయని, ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
దౌర్జన్యం చేసి రాయించుకున్నారు
- నాగయ్య, మైనింగ్ లీజుదారుడు
మండలానికి చెందిన వైసీపీ నేతలు నాపై దౌర్జన్యం చేసి లీజును రాయించుకున్నారు. నగదు అడిగినందుకు దాడి కూడా చేశారు. 323, 324 సర్వే నెంబర్లలో నా కుమారుడు మస్తానయ్య పేరుతో పదేళ్ల లీజుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆన్‌లైన్‌లో పేరు తప్పుగా ఉండడంతో ఈసీ రాలేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తీరా గ్రామస్థులంతా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారిస్తున్నారు. మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని తేలింది.
=======================