‘అదానీ’పై ఆగ్రహం!

ABN , First Publish Date - 2023-02-06T23:34:26+05:30 IST

పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్‌లలో ఎల్‌ఐసీ రూ.34 వేల కోట్ల పెట్టుబడుల వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఆరోపించారు.

‘అదానీ’పై ఆగ్రహం!
ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు

నెల్లూరు (వైద్యం) ఫిబ్రవరి 6 : పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్‌లలో ఎల్‌ఐసీ రూ.34 వేల కోట్ల పెట్టుబడుల వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరులోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చేవూరు మాట్లాడుతూ అదానీ షేర్ల పతనం వెనుక ఉన్న వాస్తవాలను సుప్రీంకోర్టు బట్టబయలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం దురుద్దేశంతోనే అదానీ గ్రూపు షేర్లు పతనమయ్యాయని, దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉండవచ్చని ఆరోపించారు. తానొక చౌకిదార్‌ అని చెప్పుకునే మోదీ ఎవరిని అడిగి ఎల్‌ఐసీని అదానీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించారని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాకుండా కేవలం పార్టీకి నిధులు రాబట్టుకునేందుకు అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని ప్రధాని మోదీ రాష్ట్ర సంపద విశాఖ ఉక్కు, కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్కో వంటి సంస్థలను అదానీకి కట్టబెట్టే హక్కు, అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే సీవీ.శేషారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి లేళ్లపల్లి సురేష్‌బాబు, నాయకులు ఉడతా వెంకట్రావ్‌, షేక్‌ ఫయాజ్‌, రమేష్‌ నాయుడు, ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, కొండా అనిల్‌కుమార్‌, పప్పర్తి గణేష్‌బాబు, అల్లాఉద్దీన్‌, అన్నం లతారెడ్డి, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:34:27+05:30 IST