12 రోజులుగా అదే పట్టుదల !

ABN , First Publish Date - 2023-09-25T00:07:44+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ శ్రేణులు తలపెట్టిన ఆందోళనలు ఆదివారం 12వ రోజు కూడా కొనసాగాయి. తొలి రోజు నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా తెలుగు తమ్ముళ్లు రిలే దీక్షలు చేస్తున్నారు.

12 రోజులుగా అదే పట్టుదల !
నెల్లూరు : సంతపేట శివాలయంలో అఖండ జ్యోతిని వెలిగించిన టీడీపీ నేతలు

బాబు విడుదలకు బారాషాహీద్‌ దర్గాలో ప్రార్థనలు

సంతపేట శివాలయంలో అఖండజ్యోతి ప్రజ్వలన

కసుమూరు, జొన్నవాడలకు పాదయాత్ర

విభిన్న ప్రతిభావంతుల సంఘీభావం

నెల్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ శ్రేణులు తలపెట్టిన ఆందోళనలు ఆదివారం 12వ రోజు కూడా కొనసాగాయి. తొలి రోజు నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా తెలుగు తమ్ముళ్లు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో బారాషాహీద్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలతో కలిసి దువా చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పరిశీలకుడు కరీముల్లా, నగరాధ్యక్షుడు మామిడాల మధు, వివిధ డివిజన్ల నేతలు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల నిరసన

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో ఆదివారం జరిగిన దీక్షలో విభిన్న ప్రతిభావంతులు పాల్గొని నల్లబెలూన్లతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వీరంతా ఎమ్మెల్యేతో సమావేశమై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.

కసుమూరుకు పాదయాత్ర

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తూ 26వ డివిజన్‌ ముస్లిం నాయకులు నెల్లూరులోని జ్యోతినగర్‌ నుంచి కసుమూరు దర్గా వరకు పాదయాత్ర చేపట్టారు. యాత్రలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, జెన్ని రమణయ్య, చేజర్ల మహేష్‌, జలదంకి సుధాకర్‌, సాబీర్‌ఖాన్‌, సారంగం గున్నయ్య, కోటిరెడ్డి, యానాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అఖండజ్యోతి ప్రజ్వలన

నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి త్వరగా బయటకొచ్చి ప్రజాక్షేత్రంలో తిరగాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నేతలు నెల్లూరు సంతపేట శివాలయంలో ఆదివారం అఖండజ్యోతి వెలిగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాబుకోసం మేము సైతం అంటూ మహిళలు ప్రతినబూనారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని, ఈ పరిస్థితిని చక్కదిద్దడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యపడుతుందన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారని, కానీ ఏ తప్పూ చేయని చంద్రబాబును మాత్రం జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గణేష్‌కుమార్‌, కల్వకుంట్ల భాస్కర్‌, మన్నార్‌స్వామి, సరోజనమ్మ, వజ్రావతమ్మ, కోటపాటి రాజా తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ...

కోవూరులో తెలుగు తమ్ముళ్లు స్థానిక వీరాంజనేయ ఆలయంలో పూజలు చేసి జొన్నవాడకు పాదయాత్ర చేశారు. జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. రాపూరు, తోటపల్లి గూడూరు చర్చిల్లో దేశం నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కావలిలో ముస్లిం మహిళలు, మైనార్టీ నాయకులతో కలిసి టీడీపీ శ్రేణులు రిలే దీక్షలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో ఉదయగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరికుంటపాడు అంకాళమ్మ ఆలయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. పొదలకూరులో టీడీపీ నాయకులు చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాలు రాసి పోస్టు చేశారు.

============

Updated Date - 2023-09-25T00:07:44+05:30 IST